- సీఎం రేవంత్ ఆత్మీయత
- కేసీఆర్ ను చూడగానే.. కూర్చున్న చోటికెళ్ళి నమస్కారం
- బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ వాకబు
- నమస్కారం చేసి.. కరచాలనం అందించిన కేసీఆర్
- రేవంత్ ది పాలమూరు ప్రేమతత్వమంటూ ప్రశంసలు
- నాడు అందెశ్రీ వద్ద.. నేడు కేసీఆర్ వద్ద.. మనసు గెలిచావ్ రేవంతన్న అంటూ వ్యాఖ్యలు
- సభలో.. సంభ్రమం
- రెండు నిమిషాలకే.. సభ నుండి వెళ్ళిపోయిన కేసీఆర్
- నెట్టింట.. బయటా అంతా ఇదే చర్చ
(హైదరాబాద్ -మహా)
సభలో ఓ ఆకట్టుకునే సన్నివేశం. అది ఆకస్మికంగా అలా జరిగిపోయిందంతే. పక్క రాష్ట్రంలో కనపడని ఆత్మీయత.. అపూర్వ ఘట్టం తెలంగాణ అసెంబ్లీలో కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు తానే స్వయంగా వెళ్ళి నమస్కారం చేయడంతో పాటు కరచాలనం అందించారు. కేసీఆర్ కూడా సభా నాయకుడిని చూసి అంతే గౌరవంగా లేచి నిలబడి స్పందించారు. కరచాలనం అందించారు. బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ సీఎం రేవంత్ ఈ సందర్భంగా పలకరించారు. ఈ దృశ్యం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి దూషించుకున్నా, ఆవేశపడ్డా పగలు.. ప్రతీకారాలు ఉండవని మరోసారి రుజువైంది. తెలంగాణ రాజకీయాల్లో ఉన్న అద్భుతం ఇదేనని, రేవంత్ లో పాలమూరు ప్రేమతత్వం ఉందని అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. నాడు అందెశ్రీ మరణించిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా పాడెమోసి అందరినీ ఆశ్చర్యపరిచిన రేవంత్ రెడ్డి సోమవారం సభలో కూర్చున్న కేసీఆర్ వద్దకు కూడా వెళ్ళి అదే ఆత్మీయత, ప్రేమ, పెద్దలపై గౌరవభావం ప్రదర్శించారు. సభా నాయకుడిగా సీఎం వెళ్ళిన సమయంలో మాజీ మంత్రులు తలసాని, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు కూడా తిరిగి అభివాదం చేశారు. సభలో తొలిరోజు ఆత్మీయ వాతావరణం కనిపించింది. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, ఎమ్మెల్యే నవీన్‌యాదవ్ ఆయనకు పలకరించి అభివాదం చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. 3 నిమిషాలు సభలో ఉన్న కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళారన్న చర్చ బాగా జరిగింది. అసెంబ్తీలో హాజరు సంతకం పెట్టేందుకే వచ్చారని పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కాగా నెట్టింట.. బయట అంతా కేసీఆర్ హాజరు, సీఎం రేవంత్ కరచాలన అంశాలపైనే బాగా చర్చ జరిగింది.
మేమిద్దరం మాట్లాడుకుంది మీకెందుకు చెబుతా?
మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామని, కేసీఆర్‌ను ఇవాళే కాదు, ఆస్పత్రిలో కూడా కలిశానని గుర్తు చేశారు. అసెంబ్లీ నుంచి వెంటనే ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలని అన్నారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన మేమిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం? అని వ్యాఖ్యానించారు. కరచాలనం చేస్తూ బాగున్నారా అని రేవంత్ రెడ్డి పలకరించారు.
మండలి భవనం రెడీ
బడ్జెట్ సమావేశాల నాటికి అసెంబ్లీ ఆవరణలోని భవనంలో శాసనమండలి సమావేశాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ ఆవరణలోని భవనంలో జరుగుతున్న మరమ్మతులను మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనులు, జరగాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం మంత్రుల ఛాంబర్లు ఉన్న ప్రాంతంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అతిథులకు ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు.
మంత్రులు సమాయత్తం కావాలి
బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ నిర్వహించారు.జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలని సూచించారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యమని తెలిపారు. ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలని తెలిపారు.







