- మునిసిపల్ ఎన్నికలకు రంగం పిద్దం
- ఓటర్ జాబితా సవరణకు నోటిఫికేషన్
- ఫిబ్రవరిలో ఎన్నికల ముహూర్తం
- 117 మునిసిపాలిటీలు.. 6 కార్పోరేషన్లు రెడీ
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 10వ తేదీ వరకు ఓటరు జాబితా తయారీకి ఎస్‌ఈసీ కసరత్తు చేయనుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల(నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కరీంనగర్, కొత్తగూడెం, రామగుండం)లో ఓటర్ జాబితా తయారీ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపు రూ.700 కోట్ల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి చివర్లో పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి స్పెషల్ఆఫీసర్ల పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరితో జీహెచ్ఎంసీ పాలకవర్గం, వచ్చే మే నెలతో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్లాంటి పాలకవర్గాల గడువు ముగియనుంది. దీంతో వీటన్నంటిని ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా? లేక గతంలో లాగానే విడి విడిగా ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. తాజాగా మున్సిపల్ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఎన్నికల సంఘం ప్రారంభించడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి ఆఖర్లో లేదా ఫిబ్రవరి మొదటివారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.







