Mahaa Daily Exclusive

  తెలంగాణ పోలీస్ కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ……

Share

  • తెలంగాణ పోలీస్ కమిషనరేట్ల
  • పునర్ వ్యవస్థీకరణ
  • రాష్ట్రంలో నాలుగు పోలీస్ కమిషరేట్లు
  • ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
  • రాచకొండలో మార్పులు చేర్పులు.. మల్కాజ్ గిరి కమిషనరేట్
  • ప్రత్యేక జిల్లాగా యాదాద్రి.. ఎస్సీ నియామకం

హైదరాబాద్, మహా :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డి, మల్కాజ్‌గిరి సీపీగా అవినాశ్ మహంతి, ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష్ యాదవ్‌లను నియమిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి పోలీస్ వ్యవస్థను నాలుగు కమిషనరేట్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్ పోర్టు, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్ రామ్ గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్ సి పురం, అమీన్ పూర్ తదితర ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశాలు నిర్వహించి మార్పుచేర్పులకు సంబంధించి తుది ప్రతిపాదనలు రూపొందించారు. ఆదివారం నిర్వహించిన సమావేశానికి పురపాలక, పోలీసు శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. సీఎం ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మల్కాజ్ గిరి కమిషనరేట్

రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్ గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటివరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించారు.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్ పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనాలుగు కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లను, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Latest