- ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు
- డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
- మావోయిస్టు పార్టీకి ఊహించని దెబ్బ
హైదరాబాద్, మహా : డీజీపీ సమక్షంలో మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా లొంగుబాటు, ఇప్పటికే కొన ఊపిరితో పోరాడుతున్న మావోయిస్టు ఉద్యమానికి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. బరిసెదేవాతోపాటు 19మంది మావోయిస్టులు దశాబ్దాల పోరటానికి గుడ్ బై చెప్పి, కారడవులు దాటి,ఆయుధాలు వదలి జనజీవన శ్రవంతిలోకి రావడంతోపాటు భారీ స్టాయిలో ఆయుధాలు, నగదును అప్పగించడం సంచలనంగా మారింది. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం, వ్యూహాత్మకంగా ముందుకు దూసుకుపోతోంది. చర్చలు, కాల్పుల విరమణ ప్రకటనలు ఏ మాత్రం లెక్క చేయకుండా మావోయిస్టుల ఏరివేతే ధ్యేయంగా అడవులను జల్లెడ పడుతూ ,లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మావోయిస్టు పార్టీ కీలక నేత బరిసెదేవా దళం లొంగుబాటు మాత్రమేకాదు, ఆపరేషన్ కగార్ తరువాత ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్న దాఖలాలులేవు.
మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఛీఫ్‌గా బరిసెదేవా కొనసాగుతున్నారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోవడంతోపాటు 48 మౌంటెడ్ వెపన్స్ అప్పగించారు. బరిసెదేవా వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదు సైతం అప్పగించడంతో, కేంద్ర హోమ్ శాఖ సైతం ఎస్‌ఐబీపై ప్రశంసల జల్లు కురిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే డీజీపీ వద్ద ఇంత మొత్తంగా ఆయుధాలతో లొంగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు. హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత గెరిల్లా లిబరేషన్ ఆర్మీ బాధ్యతలు ఇటీవల బరెసెదేవాకు అప్పగించింది మావోయిస్టు పార్టీ. గెరిల్లా దాడులు, వ్యూహాలు రచించడంలో హిడ్మాకు ధీటుగా బరిసెదేవా పనిచేశారు. ఇద్దరూ ఒకే గ్రామం నుంచి రావడంతోపాటు హిడ్మాను దగ్గరగా చూస్తూ, వ్యూహాలను అందిపుచ్చుకున్న దేవా, దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు. ఎన్నో గెరిల్లా దాడులు విజయవంతంగా నిర్వహించాడు. సాయుధ బలగాల వ్యవహారాలు చూసుకోవడంతోపాటు, మావోయిస్టులకు అవసరమైన ఆయుధ సంపత్తిని అందించడంలో కీలకపాత్ర పోషించాడు దేవా. హిడ్మా మరణం తరువాత నైరాశ్యంలో ఉన్న మావోయిస్టు పార్టీకి టార్చ్‌బేరర్ లా కనిపించిన బరిసెదేవా, బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే డీజీపీ ఎదుట లొంగిపోవడం ఆసక్తిగా మారింది.
కేంద్రం విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరిగా లొంగిపోవడం, మిగతా వారు ఎన్ కౌంటర్లలో మరణించడంతో అడవిలో మిగిలిన అన్నల పరిస్ధితి అత్యంత క్లిష్టతరంగా మారింది. ఈ ఏడాది మార్చి నాటికి అంటే మరో మూడు నెలల్లో మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారుస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చేందుకు అత్యంత చేరువలో జరుగుతున్న వరుస పరిణామాలు కనిపిస్తున్నాయి.








