Mahaa Daily Exclusive

  నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం

Share

  • నల్గొండ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలనేదే నా సంకల్పం
  • సమస్యలు లేని పట్టణంగా నల్గొండను తీర్చిదిద్దుతా
  • మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ, మహా : సమస్యలు లేని పట్టణంగా నల్గొండ ను తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్డు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద కోటి నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1100 కిలో లీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. మూడు కోట్ల 14 లక్షల 60000 వ్యయంతో వల్లభరావు చెరువు సుందరీ కరణ పనులకు శంకుస్థాపన చేశారు. లెప్రసీ కాలనీలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.లతీఫ్ సాబ్ గుట్ట సమీపంలో 50 లక్షల రూపాయల టి ఏ టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో నిర్మించిన ఎస్ ఈ-2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 68.83 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించనున్న మోతికుంట పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా ప్రారంభించిన ఎస్ ఈ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో నల్గొండ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ బిల్లు పాస్ చేయడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ,మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మేలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు తొలి మేయర్ రానున్నారని ఆయన వెల్లడించారు. నల్గొండ పట్టణంలో 272 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా పథకాలను చేపట్టడం జరిగిందని, 53 కోట్ల రూపాయలతో టి యుఎఫ్ఐడీసీ ద్వారా రోడ్లు, మురికి కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని, మరో 109 కోట్లతో సి సి రోడ్లు, 9 కోట్ల రూపాయలతో పట్టణం నలువైపులా సబ్ స్టేషన్లను ఏర్పాటు జరిగిందని, అందులో భాగంగా గురువారం రెండు సబ్ స్టేషన్లు ప్రారంభించామన్నారు. అలాగే 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని, మార్చిలోపు లతీఫ్ సాబ్ గుట్ట పనులను పూర్తి చేస్తామని, బ్రహ్మంగారి గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ,ఎవరు ఊహించని రీతిలో నిధులను తీసుకువచ్చి నల్గొండ ను అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా చేయాలన్నదే తన సంకల్పమని అన్నారు. కార్పొరేషన్ కావడం వల్ల నల్గొండకు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా కేంద్రం ద్వారా నిధులు వస్తాయని, నల్గొండ టౌన్ ను మోడల్ టౌన్ గా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. 27 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో నల్గొండ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు .

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా 60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ,20వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల ప్రణాళిక నడుస్తున్నదని, మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి వాటిని చేపట్టడం జరిగిందని మంత్రి వెల్లడించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్, ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.