Mahaa Daily Exclusive

  ఇక ఆర్ టీఓ ఆఫీస్ తో పనిలేదు..! షోరూమ్ వద్దే ‘వెహికల్’ రిజిస్ట్రేషన్‌..

Share

  • ఇక ఆర్ టీఓ ఆఫీస్ తో పనిలేదు
  • షోరూమ్ వద్దే ‘వెహికల్’ రిజిస్ట్రేషన్‌
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, మహా : కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన రిజిస్ట్రేషన్‌ ప్రకియ మరింత సులభతరం కానుంది. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే… డీలర్ షో రూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో పూర్తి చేయాలని రవాణాశాఖ ఆదేశాలిచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను (టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.

 

తప్పనున్న తిప్పలు

 

ఈ క్రమంలో ఆర్టీవో కార్యాలయాల వద్ద కొందరు డబ్బులు దండుకునే పనిలో ఉంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ డబ్బులను తీసుకుని పని పూర్తి చేస్తున్నారు. డీలర్లతో పాటు ఆర్టీవో అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ పని కానిస్తున్నారు. పైగా ఆర్టీవో కార్యాలయాల్లో కూడా ముడుపులు ఇస్తేనే పనులు అవుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలకు చెక్ పెట్టాలని గత కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల కిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాలపై సమీక్ష నిర్వహించారు. రవాణాశాఖ అధికారులకు కూడా కీలక ఆదేశిలిచ్చారు

 

ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా రాష్ట్ర రవాణశాఖ అడుగు ముందుకేసింది. డీలర్‌ వద్దనే వ్యక్తిగత వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వాహనాన్ని విక్రయించిన డీలరే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్‌ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.

 

రవాణాశాఖ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌, క్యూ లైన్‌లో వెయిటింగ్‌, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణాశాఖ కమీషన్ ఇలంబర్తి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

 

వాహనదారులు డీలర్‌ వద్ద సమర్పించాల్సిన పత్రాలు

 

వాహన ఇన్వాయిస్

ఫారం-21( విక్రయ ధ్రువీకరణ పత్రం)

ఫారం-22(రోడ్డు అనుకూలత ధ్రువీకరణ)

బీమా

కొనుగోలుదారుల చిరునామా ధ్రువీకరణ పత్రం

సదరు వ్యక్తి పేరు మీద మరో వాహనం లేదని తెలిపే డిక్లరేషన్

కొనుగోలుదారుల ఫొటో, సంతకం స్కాన్ కాపీ

వాహనం ఇంజిన్, ఛాసిస్‌ నంబర్లు ఫొటోలు

రవాణా శాఖ నిర్దేశించే ఇతర అవసరమైన పత్రాలు

 

ఈ పత్రాలన్నింటినీ డీలర్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్టరింగ్ అథారిటీ లేదా అదనపు రిజిస్టరింగ్ అథారిటీ ఆ పత్రాలను నిశితంగా పరిశీలిస్తారు. అన్ని నిబంధనల ప్రకారం ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. లేని పక్షంలో తిరస్కరించే అధికారం ఉంటుంది.

 

ఆర్సీ కారు నేరుగా ఇంటికే

 

దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, వాహనదారులకు రిజిస్ట్రేషన్ పత్రం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. నమోదు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆర్సీ కార్డు నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా కొనుగోలుదారుల చిరునామాకు పంపిస్తారు. దీని వల్ల వాహనదారులకు సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది.

 

పారదర్శకతకు పెద్ద పీట

 

ఈ సడలింపుల వల్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలను కూడా పెట్టింది. డీలర్ల వద్ద ఉన్న వాహనాల నిల్వలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. వెహికల్‌ ఇన్‌స్పెక్టర్, ఆర్టీవో, డీటీసీ, జేటీసీ, రవాణా కమిషనర్‌ కూడా అధీకృత డీలర్ల వద్ద తనిఖీలు చేయవచ్చు. తద్వారా నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Latest