- ఒంటరిగానే పురపోరు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
- బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఓర్వలేకపోతున్నాయి
- కవిత రాజకీయ పార్టీపై తనకు తెలియదని వ్యాఖ్య
హైదరాబాద్, మహా : త్వరలో జరగనున్న పురపాలక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మంగళవారం మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన రాంచదర్ రావు బీజేపీకి ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. జనసేన పోటీపై ప్రస్తావించగా అది ఆ పార్టీ నిర్ణయం కావచ్చని, ఇంతవరకు తనకే సమాచారం లేదని, ఎవరూ తనను ఈ విషయంపై సంప్రదించలేదన్నారు. బీజేపీ ఎదుగుదలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, అందుకే విమర్శలు చేస్తున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఫలితాలను అందుకున్నారని, రాష్ట్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలలో దాదాపు 90 శాతం గ్రామ పంచాయతీలలో బీజేపీ గెలిపించదని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీపై విలేకరులు ప్రశ్నించగా.. ఆమె పార్టీ పెడతారో లేదో తనకు తెలియదని బదులిచ్చారు.
చలాన్ల విషయంలో అలా చేయడం సరికాదు
ట్రాఫిక్ చలాన్లపై ఇకపై డిస్కౌంట్లు ఉండవని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే నేరుగా బ్యాంకు ఖాతా నుంచే జరిమానా కట్ అయ్యేలా టెక్నాలజీ ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బీజేపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. బ్యాంకు ఖాతాల అనుసంధానం వల్ల ప్రజల ఆర్థిక గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా అమలు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే వాహనదారుల నుంచి జరిమానా వసూలు కోసం వారి బ్యాంకు అకౌంట్లను ఆర్టీఏ వ్యవస్థతో అనుసంధానించడం సరైంది కాదన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఖాళీ అయిన ఖజానాను భర్తీ చేసేందుకు సీఎం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇలా చేయడం వల్ల సామాన్యుల బ్యాంకు ఖాతాల వివరాలు, వారి ఆర్థిక గోప్యత ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సంచార్ సాథీ’యాప్ వల్ల ప్రజల ప్రైవసీకి ముప్పు ఉందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని, మళ్లీ ఇప్పుడు అదే వారు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజల బ్యాంకు ఖాతాల్లోకే చొరబడి డబ్బులు కట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. వారిది ద్వంద్వ వైఖరి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వింతగా ఉందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ హిప్పోక్రసీ బయటపడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.








