హైదరాబాద్, మహా : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నటించిన కల్ట్ వెబ్‌సిరీస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఓటీటీలో విడుదల కావడంపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వెబ్ సిరీస్ ‘కల్ట్’ను జనవరి 17 నుండి ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ వెబ్‌సిరీస్ విడుదల చేయడాన్ని నిలిపివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ వెబ్‌సిరీస్ అడ్డుకోవాలని కోరుతూ ఉత్తమ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాథమిక వాదనలు విన్న తర్వాత సిప్లిగంజ్, నిర్మాతలు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. అయితే ఈ దశలో విడుదలను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. నిర్మాణ సంస్థ, ఇతర ప్రతివాదుల వాదనలు వినకుండా ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వడం కుదరదని తెలిపింది.
వెబ్ సిరీస్ నిర్మాత, దర్శకుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు ఉత్తమ్ వల్లూరి అనే వ్యక్తి. ఈ వెబ్‌సిరీస్‌లో మదనపల్లి హత్యలకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్ ప్రచారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విచారణలో ఉన్న కేసుకు డ్రామా జోడించి.. చిత్రీకరణ చేయడం చట్టవిరుద్ధమని, విచారణలో ఉన్న అంశాన్ని తప్పుదోవ పట్టించడం కిందకే వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ ప్రకారం గతంలో మదనపల్లి మర్డర్స్ అని పేరు పెట్టిన ఈ సిరీస్ తరువాత కల్ట్ అని పేరు మార్చారు. ఇది సబ్ జ్యుడీస్ ప్రొసీడింగ్స్‌ను వక్రీకరించి డ్రామా జోడించడమే. ఇది డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ సెక్షన్ 69ఏ,టెక్నాలజీ యాక్ట్‌ను ఉల్లంఘించినట్టు అని, కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి వెబ్‌సిరీస్ తీయడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో 2021లో జరిగిన హత్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. విశ్వాసాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి. ఇద్దరు అక్కాచెల్లెల్లు ఈ ఘటనలో మృతి చెందారు. మానసికంగా ఆ కుటుంబం సరిగా లేక ఈ దారుణం జరిగింది.








