Mahaa Daily Exclusive

  బీజేపీ మున్సిపల్ ఎన్నికల శంఖారావం: “అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వమే మా ఎజెండా” – కేంద్ర మంత్రి బండి సంజయ్

Share

  • మునిసిపల్ ఎన్నికల్లో మూడు అంశాలే ప్రధాన ఎజండాగా వెళ్థాం
  • కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేస్తాం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, మహా : రాబోయే మన్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్‍లోని క్లాసిక్ గార్డెన్‍లో జరిగిన ‘బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం’లో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం ఇస్తే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తేస్తామన్నారు. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బీజేపీ పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం ఈ మూడు అంశాలే ప్రధాన ఎజండాగా మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ వెళ్తుందన్నారు. ఇక నుండి పోలింగ్ జరిగే వరకు ఒక్కో ఇంటికి 6 సార్లు వెళ్లాలని శ్రణులకు దిశానిర్దేశం చేశారు. వార్డుల వారీగా సమస్యలున్న చోటకే వెళ్లి భరోసా ఇవ్వాలని సూచించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ దోస్తీ

బీఆర్ఎస్ కు ఓటేస్తే గెలిచిన వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళతారని కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్‍లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ దోస్తీ కట్టిందన్నారు. బీజేపీ గెలిచే చోట ఓట్లను తారుమారు చేసి మజ్లిస్‍కు అధిక సీట్లు వచ్చేలా డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులను నమ్ముకుని గెలవాలనుకుంటుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళుతోందన్నారు.

ముక్కలు కానున్న బీఆర్ఎస్ : రాంచందర్ రావు

మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ పూర్తిగా సిద్ధంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చూపిన కృషిని ఆయన అభినందించారు. దాదాపు ఐదు వేల సర్పంచ్ స్థానాల్లో పోటీ చేశామని, గతంతో పోలిస్తే బీజేపీ గెలుపు సంఖ్య పెరిగిందని చెప్పారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపడుతోందనేందుకు స్పష్టమైన నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని… ఆ పార్టీ ముక్కలవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల రాజకీయాలకు పరిమితమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతోందని, అయినా కాంగ్రెస్ కేంద్ర పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. మాట్లాడితే ఢిల్లీ వెళ్తున్న సీఎం రాష్ట్రానికి ఏం సాధించారన్నది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.