- దేశ అభివృద్ధిలో బీహారీలది కీలక పాత్ర
- టీ హబ్‌లో జరిగిన బీహార్ డెవలప్ మెంట్ సమ్మింట్ 2025 లో ఈటల హాట్ కామెంట్స్
హైదరాబాద్, మహా : దేశాభివృద్ధిలో బీహారీల పాత్ర అత్యంత కీలకమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం టీ హబ్‌లో నిర్వహించిన బీహార్ డెవలప్ మెంట్ సమ్మిట్-2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. మోడీ పాలనలో గత 11 ఏళ్లలో భారతదేశ రూపురేఖలు పూర్తిగా మారాయని, ప్రపంచంలో దేశ గౌరవం మరింత పెరిగిందని ఈటల చెప్పారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని కృషి చేస్తున్నారని, ఆ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రాల అభివృద్ధి అవసరమని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్ కావాలంటే వికసిత్ బీహార్ కూడా కావాలి’ అని మోడీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. దేశంలో వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ, మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాల్లో బీహారీల కృషి కన్పిస్తుందని ఈటల తెలిపారు. కరోనా సమయంలో తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో పనిచేస్తున్న బీహారీల సంఖ్య తెలిసి చలించిపోయానని, కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. అప్పట్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వారిని పంపించామని, కరోనా అనంతరం రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు బిహారీ కార్మికులను తిరిగి తీసుకురావాలని అభ్యర్థించారని వివరించారు.
తెలంగాణలో బీహారీలకు మద్దతు
దేశంలో యువత జనాభా 26 శాతం ఉంటే, బీహార్‌లో అది 36 శాతం ఉందని లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 2024-25 బడ్జెట్‌లో ప్రధాని మోడీ రూ.4 లక్షల కోట్లు కేటాయించారని తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న బీహారీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి మినీ ఇండియా లాంటిదని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని ఈటల అన్నారు. బీహార్ ప్రజలు వికసిత్ బీహార్‌ను కోరుకుంటున్నారని అక్కడి ప్రజలు చెప్పినట్లు తెలిపారు. ‘జంగల్ రాజ్ పోయింది’ అన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని, బీహారీల కట్టుబాటు, పని విధానం తనకు బాగా తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి వికాస్ వైభవ్, ఎమ్మెల్యే మిథిలేష్ తివారి, రాజీవ్ రంజన్ సింగ్, మాజీ ఎమ్మెల్యే లాలన్ కల్వర్, సయ్యద్ సమీద్, నవీన్ కుమార్ సింగ్, బినీత, సోనూ కుమార్ శర్మ, లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు








