Mahaa Daily Exclusive

  దక్షిణాది కుంభమేళా మేడారం: జంపన్నవాగుకు నిరంతరం నీరు – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Share

  • దక్షిణాది కుంభమేళా మేడారం జాతర
  • తల్లుల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం
  • మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • జంపన్నవాగుకు నిరంతరం నీరు పారేలా ఏర్పాట్లు

వరంగల్, ములుగు, మహా : ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేడారంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు అని తెలిపారు. గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది.. అని హర్షం వ్యక్తం చేశారు. కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీర వనితలు సమ్మక్క-సారలమ్మలు అని, దక్షిణాది కుంభమేళా మేడారం జాతర అని కొనియాడారు. ‘ఆనాడు ఫిబ్రవరి 6, 2023 న ప్రజాకంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించాను.. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం అభివృద్ధి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో రాతి కట్టడాలతో తల్లుల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. జాతర నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ఇది నాకు అరుదైన అవకాశం అని అన్నారు. జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటానని సంతోషం వ్యక్తం చేశారు.

కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం

మేడారం అభివృద్ధి చేసి ఫిబ్రవరి 6, 2023 న మొక్కుకున్న మొక్కు తీర్చుకున్నామని అన్నారు. మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు పారిస్తామని కీలక ప్రకటన చేశారు. రామప్ప, లక్నవరం నుంచి జంపన్న వాగుకు నీరు తరలిస్తామని సంచలన హామీ ఇచ్చారు. రేపు ఉదయం సమ్మక్క- సారక్క ఆలయాయాన్ని ప్రారంభించుకుని భక్తులకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.