- స్కిల్ యూనివర్సిటీలో చేరాల్సిన మొదటి విద్యార్థి సీఎం రేవంత్
- ఐఎన్ సీ ఎప్పుడో ఇటలీ నేషనల్ కాంగ్రెస్ గా మారిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మహా : బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించడాన్ని కాషాయ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీయే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్ (ఏ.ఓ. హ్యూమ్) ద్వారా స్థాపించబడిందని, ప్రస్తుతం అది ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’ (ఐఎన్ సీ) గా మారిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గాంధీ పేరును కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటోందని, నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలన్నదే గాంధీ గారి అసలు కోరికని, ప్రజలు కాంగ్రెస్‌ను ఓడిస్తూ గాంధీ గారి ఆశయాలను నెరవేరుస్తున్నారని తన పోస్టులో సంజయ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’పై సంజయ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని స్కిల్ యూనివర్సిటీలో ‘రాజకీయాలపై కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని, అందులో చేరాల్సిన మొదటి విద్యార్థి రేవంత్ రెడ్డేనని బండి సంజయ్ ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి రాజకీయ అవగాహన లోపించిందని, అందుకే ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా పెంచి పోషించిన ‘బానిస మనస్తత్వం’ నుంచి దేశాన్ని ప్రధాని మోడీ విముక్తి చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారన్నారు.








