జవహర్ నగర్, మహా : భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా… మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగర శివార్లలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… జవహర్ నగర్ లోని బాలాజీనగర్ లో నాగరాజు, భార్య అనురాధ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నారు. నాగరాజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరు ఘర్షణ పడగా మనస్థాపం చెందిన నాగరాజు (31) గురువారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ
దవాఖానాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








