Mahaa Daily Exclusive

  కన్నీటి ఘాట్కేసర్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య…

Share

  • బ్రతకలేని బాధ
  • రైలు పట్టాలపై ఓ కుటుంబం అంతిమ ప్రయాణం
  • గూడ్స్ రైలు కింద పడి తల్లీ, కొడుకు, కూతురు బలవన్మరణం

కుషాయిగూడ, మహా : ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. చదువులు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం ఉన్నా ఎందుకు బ్రతకలేకపోయారన్న ప్రశ్నలకు సమాధానం లేకుండా ఈ ఘటన అందరినీ కలచివేసింది.
బోడుప్పల్‌కు చెందిన విజయ (38), ఆమె కుమార్తె చేతన రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (16) తెల్లవారుజామున చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న ముగ్గురిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీం లీడర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె చేతన ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమారుడు విశాల్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చైతన్య కాలేజీలో చదువుతున్నారు. ఇద్దరూ చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన మరింత విషాదంగా మారడానికి కారణం..మృతురాలి తల్లి తెలిపిన వివరాలే. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. అల్లుడు సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

రైల్వే పోలీసులకు లభించిన ఉత్తరంలో “బ్రతకాలని లేదు… అందుకే ఈ నిర్ణయం” అంటూ రాసి ఉండటం కలచివేసింది. ఎలాంటి స్పష్టమైన కారణాలు లేని ఈ ఉత్తరం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇలా అర్థాంతరంగా జీవితాన్ని ముగించుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.