- హ్యాండ్ రైస్ తో ఎన్నిక
- తెలంగాణ మున్సిపల్ మేయర్, ఛైర్పర్సన్ల ఎన్నికపై
- ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ
హైదరాబాద్, మహా : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా.. 13న కౌటింగ్, 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు, 16న రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలను పరోక్ష పద్దతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఎన్నికైన వార్డు సభ్యులు, ఎక్స్అఫిషియో సభ్యులతో కలిసి 50 శాతం హాజరైతేనే ఈ ఎన్నిక నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికను చేతులెత్తే పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఎన్నికలకు ముందు రోజు పార్టీలు విప్‌లను జారీ చేస్తూ ఆ లేఖను ఎన్నికల అధికారులకు అందజేయాలని సూచించింది.
ఫిబ్రవరి 16 తేదీ ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎస్ఈసీ వెల్లడించింది. సమావేశం ప్రారంభమైన గంటలోపు మొత్తం సంఖ్యలో సగం మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు 40 మంది వార్డు సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ఉంటే మొత్తం 41 అవుతారని ఎన్నికకు 21 మంది హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీలు జారీ చేసిన విప్‌లను అధికారులు ఎన్నికలు జరిగే హాల్లో చదివి వినిపిస్తారున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నికలు బహిరంగంగా వార్డు సభ్యులు చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తారని అన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించే ఏ సభ్యుడైనా అనర్హత వేటుకు గురవుతారని తెలిపారు. ఫిబ్రవరి 16న ఎన్నికకు సరిపడా కోరం లేకపోయినా లేదా ఎన్నికలు విఫలమైనా తిరిగి 17న ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. ఆ రోజు కూడా ఎన్నిక జరగని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తే మరో తేదీని ఖరారు చేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఇక మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అన్ని జిల్లాల్లో ఎక్స్అఫిషియో సభ్యుల పూర్తి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఈ నెల 16న మేయర్లు, ఉప మేయర్లు, పురపాలక సంఘాల ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరగనుండగా.. వాటిలో ఎక్స్అఫిషియో సభ్యులకు ఓటుహక్కు ఉంటుందని ఎస్ఈసీ తెలిపింది. ఇప్పటికే నమోదు చేసుకున్న వారి వివరాలు ఈ నెల 4వ తేదీలోగా తమకు పంపాలని జిల్లా కలెక్టర్లను సూచించింది. కొత్తగా నమోదు చేసుకునే వారికి ఈ నెల 11 నుంచి 14 వరకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఎస్ఈసీ రాణికుముదిని ఆదేశించారు.








