Mahaa Daily Exclusive

  మహిళా న్యాయవాది దారుణహత్య….

Share

  • మహిళా న్యాయవాది దారుణహత్య
  • సోదరుడే హంతకుడు
  • ఆస్తి తగాదాలే కారణం

మొయినాబాద్‌, మహా : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది స్వప్న (34) హత్యకు గురయ్యారు. మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల కోర్టులో స్వప్న న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆమె కుటుంబంలో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం పొలం వద్ద పంచాయతీ జరుగుతుండగా స్వప్నను సోదరుడు రాజు హతమార్చాడు. హత్య సమాచారం అందుకున్న మొయినాబాద్‌ పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రాజు మూడేళ్లుగా పథకం పన్నాడు: తల్లి వెంకటమ్మ

స్వప్నను చంపాలని రాజు మూడేళ్లుగా పథకం పన్నాడని తల్లి వెంకటమ్మ అన్నారు. హతమార్చేందుకు ఇప్పటికే రెండుసార్లు యత్నించాడని చెప్పారు. భూమి సర్వే అనంతరం తిరిగి వెళ్తుండగా స్వప్నపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని తెలిపారు. కర్రలు, కత్తులతో దాడి చేశారని, రాజుతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని వెంకటమ్మ కోరారు.

న్యాయవాదుల ఆందోళన

స్వప్న హత్యపై చేవెళ్ల కోర్టు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విధులను బహిష్కరించి మొయినాబాద్‌ పీఎస్‌ వద్ద ఆందోళనకు దిగారు. పీఎస్‌ ఎదుట ఉన్న హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు.