Mahaa Daily Exclusive

  కాకతీయుల శైవక్షేత్రానికి ఆధరణ కరువు….

Share

  • కాకతీయుల శైవక్షేత్రానికి ఆధరణ కరువు.
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు
  • ఆదాయాలుంటేనే చైర్మైన్ లా…?
  • అభివృద్ధికి ఆమడదూరంలో శంకరగిరి దుర్గేశ్వర ఆలయం.

దమ్మపేట ,మహా :
హరహర మహదేవ..శంభోశంకర అంటూ భక్తులు శైవక్షేత్రాలకు తరలివెళ్ళే మహా శివరాత్రి పండుగ పర్వదినాన ఆనాటి చరిత్ర కలిగిన శైవక్షేత్రానికి ఆధరణ కరువైంది. చరిత్ర పుటల్లో లిఖించదగిన కాకతీయులు ,రెడ్డిరాజులు పరిపాలించిన ఆనాటి రోజుల్లోని శైవక్షేత్రాలకు నేడు అభివృద్ధి లేక ,ఆలనా పాలనా లేక వెలవెలబోతున్నాయి. కేవలం ఆదాయ వనరులున్న పట్టణ ప్రాంత ఆలయాలకు మాత్రమే గ్రామస్తులు లేదా ప్రజాప్రతినిధులు పోటీలు పడుతున్నారే తప్ప , గుట్టలపైన ,అడవుల్లో కొలువుదీరిన శైవక్షేత్రాలకు ఎటువంటి ఆసక్తి ని కనబరచకపోవడంతో అవి కాలక్రమేణ తమ ఉనికిని కోల్పోతున్నాయి. మహా శివరాత్రి ఒక్కరోజుకు మాత్రమే ముస్తాబు అయ్యే శివాలయాలు , కనీసం ఆరోజు కూడా ఆధరణ లేక ,పైసా ఆదాయం లేక వెలవెలబోతున్న పరిస్థితి చూస్తే ఎంతటి భక్తునికైనా మనస్సు చలించక తప్పదు. కానీ మండలంలో అత్యున్నత హోదాలో ఉన్న ప్రజా పాలకులు మాత్రం కనీసం ఈ ఆలయం వైపు ఒక్కసారైనా కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు కొందరి భక్తులనుండి తరచుగా వినిపిస్తున్నాయి.

ఇంతకీ ఆ శైవక్షేత్రం ఎక్కడిదో… ఏ ప్రాంతంలో ఉందో తెలియజేయలేదు కదా…
అదే నండి దమ్మపేట మండలానికి చెందిన గురవాయిగూడెం అటవీ ప్రాంతంలో ఎత్తైన గుట్టపై కొలువైన శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు తరచుగా చర్చించుకుంటుంటారు. గతంలో కాకతీయుల పాలనలో ఈ శంకరగిరి గుట్టపై యుద్ద సమయంలో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళే గుర్తులు ,ఆ కాలపు కట్టడాలు ఇంకా నేటికి కూడా దర్శనమిస్తుంటాయి్. అప్పడు రాజులు నిత్యం శివారాధన చేసేవారు కాబట్టి శైవక్షేత్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. అందుకే రాతి కట్టడాలతో శివాలయాన్ని నిర్మించి ,శివారాధన జరిపారని చరిత్ర చెప్పడం జరుగుతుంది. శత్రువుల నుండి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు లోతైన దిగుడు బావులు , గుట్టపై చుట్టూ కోట గోడ వలే రాతితో నిర్మించిన బలమైన ,పొడవైన రాతి బండల కట్టడాలు నేటికీ దర్శనమిస్తుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఆధరణ కరువు :
ఇంతటి ఘనచరిత్ర గల శైవ క్షేత్రాన్ని ఇక్కడి ప్రజా పాలకులు నిర్వీర్యం గా ,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మాత్రం తరచుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఓ ఉన్నతస్ధాయి అటవీశాఖ అధికారి కొంతమేరకు సహకరిస్తానని అప్పట్లో హామీ ఇచ్చినట్లు వార్తలు పుకార్లు చేశాయి. అటు తర్వాత కొందరు ప్రజా పాలకులు గుట్టపైకి ఏకంగా బిటి రోడ్ వేయిస్తామంటూ చేసిన హామీలు నీటిమూటలుగా మిగిలిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

చైర్మన్ పదవులు లేనందునే…:

ఆలయానికి ముఖ్యంగా కమిటీ ,చైర్మన్ లేనందు వల్లనే ఎవరూ అభివృద్ధి చేయడం లేదనే అనుమానాలు పలువురిలో బలంగా ఉన్నాయి. ఆదాయ వనరులు లేని ఆలయాలకు కమిటీలు ,చైర్మన్లు అంటే ససేమిరా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదనే వాదనలు మరికొందరు వినిపిస్తున్నారు. అందువల్ల ఈ ఆలయం అభివృద్ధి కి నోచుకోక ఆమడదూరంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది.

శంకరగిరి గుట్టపై శివనామస్మరణ :
శంకరగిరి దుర్గేశ్వర గుట్టపై శివనామస్మరణ చేయాలని కొందరు గ్రామస్తులు ,మల్కారం ,గుర్వాయిగూడెం ,దమ్మపేట కు చెందిన శివభక్తులు పట్టుదలతో తమ శక్తి మేరకు చేస్తున్నారు. కానీ గుట్టపై ఉండటంతో కాలుదారి ,రాతి దారి తప్ప వేరే మార్గం లేనందున సాధారణ వ్యక్తుల వలన సాధ్యపడని పరిస్థితి లో ఉన్నారు. ఎవరైనా ప్రజా పాలకులే ,ప్రభుత్వ నిధులు ద్వారా అభివృద్ధి చేయిస్తే చరిత్ర ను గుర్తించినట్లు గా ఉంటుందని గ్రామస్తులంతా కోరుతున్నారు. కేవలం మహా శివరాత్రి కి మాత్రమే ఈ ఆలయం గుర్తు చేసుకునేలా కాకుండా ,నిత్యం గుర్తింపు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కొందరు కోరుతున్నారు.

Latest