*హత్య కాదు..ల్యాదెల్ల రాజుది సహజ మరణమే*
*ప్రత్యేక దర్యాప్తు అధికారి ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు*
*మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ*
మహా వరంగల్ బ్యూరో ;
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు అలియాస్ లవ్ రాజు మృతి కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టిన అనంతరం అది సహజ మరణమేనని తేలినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి, పరకాల ఏసీపీ సీహెచ్ సతీష్ బాబు స్పష్టం చేశారు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 19న ల్యాదెల్ల రాజు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా.. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 337/2025 కింద కేసు నమోదైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఈ కేసు తాలూకు లోతుపాతులను వెలికితీసేందుకు పరకాల డివిజన్ ఏసీపీని ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించి అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ
దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థల పరిశీలన, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణుల సేవలను పూర్తి స్థాయిలో విని యోగించుకున్నట్లు ఏసీపీ తెలిపారు. వీటితో పాటు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్స్ తో పాటు అనుమానితుల విచారణ తదితర అన్ని సాంకేతిక కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మృతుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన ప్రతి అనుమానం పైనా ప్రత్యేకంగా విచారణ జరిపామన్నారు.








