(మహా నెట్ వర్క్)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీ ఫలితాలను నమోదు చేశాయి. 13 మున్సిపాలిటీలలో 6 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకోగా నాలుగు స్థానాలను బీఆర్‌ఎస్ గెలుపొందింది. అలియాబాద్, పరిగిలో హంగ్ రాగా మొయినాబాద్‌లో ఎవరూ ఆధిక్యత చూపకోలేకపోయారు. బీజేపీ ఆమనగల్ మినహా ఎక్కడా గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉండి కీలక జిల్లా అయిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మున్సిపల్ ఫలితాలు నువ్వానేనా అనే విధంగా వచ్చాయి. కొడంగల్, చేవెళ్ల , శంకర్‌పల్లి, షాద్‌నగర్, వికారాబాద్, తాండూరులో కాంగ్రెస్ సత్తా చాటింది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్‌లో గులాబీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలియాబాద్, పరిగిలో హంగ్ రాగా మొయినాబాద్‌లో ఎవరూ మ్యాజిక్ నెంబర్‌ను చేరుకోలేక పోయారు.
మేడ్చల్ జిల్లాల్లో కారు జోరు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉండగా రెండు బీఆర్‌ఎస్ గెలుపొందగా ఒకటి హంగ్ వచ్చింది. మూడుచింతలపల్లిలో 24 స్థానాలు ఉండగా 14 స్థానాలలో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ 9 స్థానాలకే పరిమితం అయ్యింది. బీజేపీ ఒక చోట బోణీ గొట్టింది. ఎల్లంపేట్‌లో 24 స్థానాల్లో 12 చోట్ల గులాబీ పార్టీ జయకేతనం ఎగరేసింది. 8 చోట్ల కాంగ్రెస్ గెలుచుకుంది. 4 చోట్ల బీజేపీ ఖాతా తెరిచింది. అలియాబాద్‌లో 20 స్థానాల్లో 8 కాంగ్రెస్, 7 బీఆర్‌ఎస్ గెలుచుకుంది. 3 చోట్ల బీజేపీ గెలుచుకోగా రెండు చోట్ల ఇతరులు నెగ్గారు. ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభావం చూపారు. విస్తృతగా పర్యటిస్తూ బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేశారు.
రంగారెడ్డి జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 6 మున్సిపాలిటీలలో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాద్‌నగర్‌లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఇబ్రహీంపట్నం, అమనగల్ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. మొయినాబాద్‌లో మిశ్రమఫలితాలు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 24 స్థానాలలో 13 చోట్ల బీఆర్‌ఎస్ గెలుపొందింది. 8 చోట్ల కాంగ్రెస్ 2 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. చేవెళ్లలో 18 స్థానాలకు 11 చోట్ల కాంగ్రెస్ పాగా వేసింది. 4 చోట్ల బీఆర్‌ఎస్, 3 చోట్ల బీజేపీ గెలుపొందాయి. శంకర్‌పల్లిలో 15 స్థానాల్లో 9 కాంగ్రెస్ దక్కించుకోగా 4 బీఆర్‌ఎస్, ఇద్దరు ఇతరులు గెలిచారు. షాద్‌నగర్‌లో దాదాపు హోరాహోరీగా సాగిన ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. 28 స్థానాలకు గానూ 15 చోట్ల కాంగ్రెస్ సత్తా చాటింది. 11 చోట్ల బీఆర్‌ఎస్ గెలుపొందింది. ఒక స్థానంలో బీజేపీ మరొక స్థానంలో ఇతరులు గెలుపొందారు. ఆమనగల్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఫలితాలు వచ్చాయి. మొత్తం 15 వార్డుల్లో 8 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా.. 6 చోట్ల బీజేపీ నెగ్గింది. కేవలం ఒక స్థానంలో కాంగ్రెస్ ప్రభావం చూపింది.
వికారాబాద్లో మూడు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ పాగా :
వికారాబాద్ జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలలో కొడంగల్, వికారాబాద్, తాండూరులో కాంగ్రెస్ గెలుపొందింది. పరిగిలో హంగ్ వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో 10 స్థానాలను కాంగ్రెస్ గెలుపొందింది. ఒక స్థానంలో బీఆర్‌ఎస్, మరో స్థానంలో ఇతరులు గెలుపొందారు. వికారాబాద్ అధికార పార్టీ ఖాతాలో వేసుకుంది. 34 వార్డుల్లో 16 కాంగ్రెస్ దక్కించుకుంది. 11 బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 4 చోట్ల ఇతరులు 3 చోట్ల గెలిచారు. తాండూర్‌లో 36 స్థానాలకు గాను కాంగ్రెస్ 19 గెలుపొందింది. 12 చోట్ల బీఆర్‌ఎస్, 3 చోట్ల బీజేపీ ఖాతా తెరిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. పరిగిలో హంగ్ ఫలితాలు వచ్చాయి. 18 స్థానాల్లో 8 చొప్పున కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గెలుపొందాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు.








