- ఆదిలాబాద్ లో హంగ్ పాలిటిక్స్
- ఆరు మునిసిపాలిటీల్లో హంగ్
- ఆదిలాబాద్ లో మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ
- నిర్మల్ లో బీజేపీకి కాంగ్రెస్ కు షాక్.. భైంసా, కాగజ్ నగర్ లోనూ ఇదే సీన్
- నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజల షాక్
- (మహా నెట్ వర్క్ )
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపోరులో మిశ్రమ ఫలితాలే ఎక్కువ వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఉండగా నిర్మల్, చెన్నూరు, లక్షెట్టిపేట్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బిజెపి మెజారిటీ మార్క్ కు నాలుగు సీట్ల దూనంలో ఉండిపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, క్యాతనపల్లి, బెల్లంపల్లి, భైంసా, ఖానాపూర్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు.
భైంసాలో రెబల్స్ హవా : ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ ప్రధానపార్టీగా అవతరించినా మెజారిటీ సాధించలేకపోయింది.మెుత్తం 49 వార్డులకు గాను బీజేపీ 21 స్థానాల్లో విజయభేరీ మోగించింది. 11 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్ గెలుచుకోగా, ఐదు వార్డులు కాంగ్రెస్ రెబెల్స్, ఆరు వార్డులు ఎంఐఎం సాధించాయి. నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమైంది. ఇక్కడ 42 స్థానాలకు గాను 24 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ 13, బీఆర్ఎస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. స్వతంత్రులు 3 చోట్ల గెలిచారు. భైంసా మున్సిపాలిటీలో రెబల్స్ హవా నడిచింది. పార్టీ టికెట్ ఇవ్వనివారు స్వతంత్రులుగా పోటీ చేసి ఏకంగా 19 వార్డుల్లో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డుతోనే సరిపెట్టుకుంది. 6 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎవరికి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 12 వార్డులకు గాను కాంగ్రెస్ 3, బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఒక స్వతంత్య్ర అభ్యర్థి కూడా గెలుపొందారు.
ఆసిఫాబాద్ జిల్లాలో హంగ్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మెుత్తం 20 వార్డుల్లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మెుత్తం 30 వార్డులకు గాను కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో 10 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇక్కడ 5 వార్డుల్లో బీజేపీ, ఇతరులు 5 వార్డులను గెలుపొందారు.
మంచిర్యాల జిల్లాలో
మంచిర్యాల జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా, అందులో 14 వార్డులను కాంగ్రెస్, 14 బీఆర్ఎస్ గెలుచుకొని హంగ్ ఫలితాలు సాధించాయి. ఒక స్థానంలో బీజేపీ, స్వతంత్రులు 5 వార్డుల్లో గెలుపొందారు. చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. 18 వార్డుల్లో పదకొండు కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ , 2 బీజేపీ, ఇతరులు ఒక వార్డును గెలుపొందారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. 22 వార్డుల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 10, ఒక బీజేపీ, ఇతరులు 4 వార్డులు గెలుచుకున్నారు. లక్షెట్టిపేట్ పురపోరులో కాంగ్రెస్ సత్తా చాటింది. మెుత్తం 15 వార్డులకు గాను 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 3 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా ఒక వార్డును బీజేపీ కైవసం చేసుకుంది.








