Mahaa Daily Exclusive

  ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి…

Share

  • పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం…
  • ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. ఒక కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్ లోతుల్లోకి దూసుకువెళ్లడంతో, కారు వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) జలసమాధి అయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సురక్షితంగా బయటపడి, అక్కడి నుండి పరారు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ప్రమాదమా? కుట్రనా?

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా రిజర్వాయర్ వైపు దూసుకుపోయింది. కారు పూర్తిగా నీట మునగడంతో వెనుక సీట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో కారును, మృతదేహాన్ని బయటకు తీశారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడం, వెనుక సీట్లో ఉన్న వ్యక్తి మరణించడంపై పోలీసులు ‘అనుమానాస్పద మృతి’గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బొగ్గుల శ్రీనివాస్… ఒక సంచలన రచయిత ప్రస్థానం…

మృతి చెందిన బొగ్గుల శ్రీనివాస్ సాధారణ వ్యక్తి కాదు. తెలుగు సాహిత్య మరియు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన మేధావి. ఆయన నేపథ్యం పరిశీలిస్తే:

జననం & నేపథ్యం… 1977, మార్చి 5న కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో జన్మించారు. ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పూర్తి చేసిన ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ.

సాహిత్య పరిశోధన… జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రచనలపై సమగ్ర పరిశోధన చేసి, వారి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

సంచలన పుస్తకం… 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన రాసిన “{పవన్ కల్యాణ్ హటావో – పాలిటిక్స్ బచావో” అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 8,45,000 కాపీలు అమ్ముడై ఒక రికార్డును నెలకొల్పింది.

ప్రాణహాని & రక్షణ…. ఈ పుస్తక విడుదల సమయంలో ఆయనకు తీవ్రమైన బెదిరింపులు రావడంతో, అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక రక్షణ కూడా కల్పించింది.

పోలీసుల దర్యాప్తు

గతంలో రాజకీయంగా సంచలనం సృష్టించిన వ్యక్తి కావడంతో, ఈ ప్రమాదం వెనుక ఏవైనా పాత కక్షలు ఉన్నాయా? లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ పట్టుబడితేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఒక గొప్ప పరిశోధకుడిని, ధైర్యవంతుడైన రచయితను కోల్పోవడం సాహిత్య లోకానికి,పౌర సమజానికి తీరని లోటు.

Latest