- ఇక రాష్ట్రంలో మూడో విద్యుత్ డిస్కమ్
- జీవో విడుదల చేసిన ప్రభుత్వం
- వ్యవసాయం, ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పర్యవేక్షణ
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో మూడో విద్యుత్ డిస్కమ్ ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీజీఎస్ పీడీసీఎల్, టీజీఎన్ పీ డీసీఎల్ విద్యుత్ డిస్కంలు ఉండగా తాజాగా మరోక డిస్కమ్ ను ఏర్పాటు చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరుతో ఈ కొత్త డిస్కమ్ పని చేయనుంది.
ఈ కొత్త విద్యుత్ డిస్కమ్ ద్వారా వ్యవసాయం, మిషన్ భగీరథ (సీపీడబ్ల్యుఎస్), హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్ బీ, ఎత్తిపోతల పథకాలతో పాటు మున్సిపల్ నీటి కనెక్షన్లకు ప్రత్యేక డీటీఆర్ ల ద్వారా విద్యుతును సరఫరా చేస్తారు. కేటాయించిన పీపీఏ వాటా ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయడంతో పాటు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తారు. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీ ఫరూఖీ వ్యవహరించనున్నారు. డైరెక్టర్లుగా వంటేరు తిరుపతి రెడ్డి (డైరెక్టర్-ఫైనాన్స్, టీజీఎన్ పీడీసీఎల్), పి. కృష్ణా రెడ్డి (డైరెక్టర్-ఫైనాన్స్, రెవెన్యూ & లీగల్, టీజీఎస్ పీడీసీఎల్), వంగూరు మోహన్ రావు (డైరెక్టర్-ప్రాజెక్ట్స్, టీజీఎన్ పీడీసీఎల్), ఎన్. నరసింహులు (డైరెక్టర్-ఆపరేషన్, టీజీఎస్ పీడీసీఎల్) ఉండనున్నారు. ఈ కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటుపై గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. విద్యుత్ విభాగంలో ప్రక్షాళనకు అవసరమైన సంస్కరణలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో వ్యవసాయం, గృహజ్యోతి, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసే 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గతంలో సూచించారు. ఇందుకు గాను రాష్ట్రమంతా ఒకే యూనిట్‌గా కొత్త డిస్కమ్ పరిధి ఉండాలని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సంబంధిత శాఖ అధికారులు కొత్త డిస్కమ్ ఏర్పాటుపై కసరత్తు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అధికారికంగా జీవోను విడుదల చేశారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) పేరిట కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.








