Mahaa Daily Exclusive

  బలితీసుకున్న వేధింపులు…..

Share

బలితీసుకున్న వేధింపులు.
* కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని బలవన్మరణం.
* చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన శ్రీవిద్య.
* బనిగండ్లపాడులో అలుముకున్న విషాదఛాయలు.
హైదరాబాద్, మహా:
ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటుందనుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చింది. తోటి విద్యార్థుల పైశాచిక వేధింపులు భరించలేక అర్ధాంతరంగా తనువు చాలించింది. కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పై తరగతుల విద్యార్థుల మానసిక హింసకు కృంగిపోయిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ కన్నుమూసిన హృదయవిదారక ఘటన సోమవారం వెలుగుచూసింది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన కుటుంబం ఉపాధి నిమిత్తం మధిర పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నది. వారికి ఇద్దరు సంతానం. పంతొమ్మిదేళ్ల వయసున్న కూతురు శ్రీవిద్య వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యాసంస్థలో కొందరు విద్యార్థుల ప్రవర్తన ఆమె పాలిట శాపంగా మారింది. వారి రోజువారీ వేధింపులకు నిత్యం నరకయాతన అనుభవించిన ఆ పడుచుగుండె తీవ్ర మనస్తాపానికి గురైంది. భరించలేని బాధతో ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రాణాలు తీసుకునేందుకు యత్నించింది.
తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీవిద్య తన దయనీయ స్థితిని కన్నతల్లికి రోదిస్తూ తెలియజేసింది. విషయం తెలుసుకుని తల్లడిల్లిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం నిమిత్తం వైద్యుల సూచనల మేరకు హైదరాబాదుకు తీసుకువెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ చికిత్స పొందుతున్న ఆ యువతి సోమవారం తుదిశ్వాస విడిచింది. చేతికొచ్చిన బిడ్డ ఇలా విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి స్వగ్రామం బనిగండ్లపాడులో తీవ్ర విషాదం అలముకుంది. శ్రీవిద్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశ్వవిద్యాలయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉన్నది.