ఒంటరి యువతే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల.
* డేటింగ్ యాప్స్ పేరుతో హనీట్రాప్.. వీడియో కాల్ చేస్తే నిలువు దోపిడీయే!
* ఏఐ వీడియోలతో ఆకర్షణ.. మార్ఫింగ్ తో బ్లాక్‌మెయిలింగ్.
* సైబర్ వలలో చిక్కుకున్నారా? భయపడకండి.. వెంటనే 1930కి కాల్ చేయండి.
* ఆన్‌లైన్ మోసాలపై వీసీ సజ్జనార్ హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
మారుతున్న పరిస్థితుల్లో ఒంటరితనానికి అలవాటు పడిన యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారి వీసీ సజ్జనార్ హెచ్చరించారు. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో మాట్లాడండి” అంటూ వచ్చే ప్రకటనల వెనుక ఉన్నది నిజమైన వ్యక్తులు కాదని, అవన్నీ ఏఐ సాంకేతికతతో సృష్టించిన వీడియోలని ఆయన స్పష్టం చేశారు. ఆ మాయమాటలు నమ్మి వారు సూచించిన లింక్స్ ద్వారా ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే, మన ఫోన్‌లోని కాంటాక్ట్స్ మరియు గ్యాలరీ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతాయని వివరించారు. ముఖ్యంగా రాత్రిపూట సరదాగా వీడియో కాల్ చేస్తే, అవతలి వైపు అసభ్యకరమైన వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై ఉన్న మన ముఖాన్ని రికార్డ్ చేసి మార్ఫింగ్ చేస్తారని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆ వీడియోలను బంధుమిత్రులకు పంపుతామని బెదిరించి సెక్స్‌టార్షన్‌కు (బ్లాక్ మెయిలింగ్) పాల్పడతారని, పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటూ పోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో ఎవరూ ఊరికే స్నేహితులు అవ్వరని, ఆ ఆకర్షణ వెనుక డబ్బు, పరువును దెబ్బతీసే భారీ కుట్ర దాగి ఉందని గుర్తుంచుకోవాలన్నారు. క్షణికావేశంలో గుర్తు తెలియని డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఈ తరహా సైబర్ వలలో చిక్కుకుని ఉంటే, పరువు పోతుందేమోనని భయపడి మోసపోవద్దని, తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ కోరారు.








