మహా :సంగారెడ్డి ప్రతినిధి :
సదాశివపేట మండలంలోని నాగులపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని నాగులపల్లి సర్పంచ్ విజయలక్ష్మి శివానందం గౌడ్ ఆరోపించారు. మంగళవారం నాడు కురిసిన వర్షానికి పాఠశాల అదనపు తరగతి గదులు పెచ్చులు ఊడడంతో పాటు మూత్రశాలలు కూలిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై ప్రజావాణిలో రెండు మూడు సార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నూతన అదనపు తరగతి గదులు,మూత్రశాలలు నిర్మాణంలో అధికారులు చొరవ చూపలేదని విజయలక్ష్మి గారు ఆరోపించారు. గ్రామంలో పాఠశాల అదనపు తరగతులు శిథిలావస్థలో ఉండటం వల్ల విద్యార్థులు పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారని వర్షం పడితే చాలు విద్యార్థుల హాజరు శాతం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాగులపల్లి గ్రామంలో పాఠశాల అదనపు తరగతి గదులు వెంటనే నిర్మాణం చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు








