అవార్డుల కొలబద్దలకు అందని అక్షర శిఖరం సతీష్ చందర్..!
నాలుగున్నర దశాబ్దాలుగా పత్రికా రంగానికి, తెలుగు సాహిత్యానికి నిరాటంకంగా సేవలందిస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ సతీష్ చందర్. పశ్చిమ గోదావరి జిల్లా గడ్డపై పుట్టి, తెలుగు నాట ప్రసిద్ధ పత్రికా సంపాదకుడిగా, కవిగా, కథకుడిగా, వ్యంగ్య రచయితగా, నవలాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన పేరొందారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ‘కళారత్న హంస అవార్డు 2026’ ప్రకటించి, అనూహ్యంగా ఆ వెంటనే దానిని వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామం సతీష్ చందర్ గారి స్థాయిని ఎంతమాత్రం తగ్గించదు సరికదా, పురస్కారాల ఎంపికలో ప్రభుత్వాల విధానాలను, పారదర్శకతను ప్రశ్నించేలా చేస్తోంది.
పాత్రికేయ రంగానికి ఒక పాఠశాల
సతీష్ చందర్ గారి ప్రస్థానం కేవలం ఒక పత్రికకో, ఒక యాజమాన్యానికో పరిమితమైనది కాదు. ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు ప్రధాన సంపాదకుడిగా, ‘వార్త’ దినపత్రికకు వ్యవస్థాపక సహ సంపాదకులుగా ఆయన ముద్ర అద్వితీయం. ఆయన కలానికి ఉన్న సామాజిక స్పృహ, భాషపై ఉన్న పట్టు అనన్యం. కేవలం రాతలకే పరిమితం కాకుండా, ‘ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం’ (AP College of Journalism) ను స్థాపించి, గత 29 ఏళ్లుగా వేలాది మంది యువతీయువకులను నిబద్ధత గల పాత్రికేయులుగా సమాజానికి అందించిన ఘనత ఆయనది. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’లో సభ్యత్వం ఆయన వృత్తిపరమైన నిబద్ధతకు, జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపునకు సజీవ సాక్ష్యం. ఆయన ఒక వ్యక్తి కాదు, తెలుగు జర్నలిజం చరిత్రలో ఒక వ్యవస్థ.
పురస్కారాల రాజకీయాలు – ఎవరికి నష్టం..?
ప్రభుత్వం ఒక అవార్డును అధికారికంగా ప్రకటించి, ఆ మరుసటి రోజే వెనక్కి తీసుకోవడం అనేది ఆయా పాలకుల నిర్ణయ లోపాన్ని, వ్యవస్థాగత అస్థిరతను చూపిస్తుంది. దశాబ్దాల పాటు సమాజాన్ని మేల్కొల్పిన ఒక సీనియర్ జర్నలిస్టుకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం శోచనీయం. అయితే, నిజమైన రచయిత లేదా పత్రికా సంపాదకుడు ఏనాడూ ప్రభుత్వ పురస్కారాల కోసం పాకులాడరు. వారి కలం ఎప్పుడూ నిష్పాక్షికంగా, ప్రజల పక్షానే నిలబడుతుంది. ప్రభుత్వాల గుర్తింపులు తాత్కాలికం కావచ్చు, కానీ సమాజం ఇచ్చే గౌరవం శాశ్వతం.
నిజమైన పురస్కారం పాఠకుల ఆదరణే
సతీష్ చందర్ గారికి అసలైన అవార్డు ఆయన తర్ఫీదు ఇచ్చిన వేలాది మంది శిష్యులే. ఆయన రాసిన కథలు, నవలలు, సంపాదకీయాలు చదివి చైతన్యం పొందిన లక్షలాది మంది పాఠకులే ఆయనకు దక్కిన నిజమైన పురస్కారాలు. ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలు రద్దు కావచ్చేమో కానీ, ఒక గురువుగా ఆయన పంచిన జ్ఞానం, ఒక సంపాదకుడిగా ఆయన వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనివి. ఈ తాజా పరిణామం ఆయన శిష్యులకు, అభిమానులకు బాధ కలిగించినా… సతీష్ చందర్ గారి అక్షర ప్రయాణం ఎప్పటికీ ఆదర్శప్రాయమే!
– ప్రొద్దువాక భీమ రావు
9948635844








