హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న ఎస్. కుమార్ కు పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని, ఆ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఎన్నికల సహ-ప్రభారీ (కో ఇంచార్జీ) గా నియమిస్తూ బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, కేరళం రాష్ట్రాలకు కూడా ఎస్సీ మోర్చా తరపున ప్రభారీలను, సహ-ప్రభారీలను నియమించారు. ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి ప్రభారీగా శంభునాథ్ తుండియా, సహ – ప్రభారీలుగా ఎస్. కుమార్, ఎస్. మునిస్వామి (మాజీ ఎంపీ)ని నియమించారు. ఎస్. కుమార్ గత కొంతకాలంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు. ఆయన పనితీరును గుర్తించిన పార్టీ నాయకత్వం, తమిళనాడు ఎన్నికల్లో ఓటర్లను సమన్వయం చేసుకుంటూ, పార్టీ విజయానికి వ్యూహరచన చేసేందుకు ఈ కీలక బాధ్యతను కట్టబెట్టింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ నాయకత్వానికి ఎస్. కుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.








