హిల్ట్’ భూముల్లో రియల్ మంటలు..
*విచారణకు దమ్ముందా?
* బీఆర్ఎస్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్!
* సీబీఐ, ఈడీ.. దేనికైనా మేం సై!
* అసెంబ్లీని కుదిపేసిన ‘హిల్ట్’ ప్రకంపనలు..
* తూటాల్లా పేలిన రేవంత్ వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరంలో వేల కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక భూముల చుట్టూ ఇప్పుడు తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. నగరం నడిబొడ్డున కాలుష్యాన్ని వెదజల్లుతున్న పాత పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు ఆవలకు తరిమికొట్టి, ఆ భూములను రియల్ ఎస్టేట్, వాణిజ్య అవసరాలకు వాడుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హిల్ట్’ పాలసీ ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సెన్సేషన్ సృష్టిస్తోంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన వేడివేడి చర్చలో సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై నిప్పులు చెరిగారు. హిల్ట్ పాలసీ ముసుగులో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుగుతోందంటూ గులాబీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పాత పాలసీతో పాటు, తమ ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న తాజా హిల్ట్ పాలసీపై సీబీఐ, ఈడీ లేదా సిట్.. ఇలా ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు తమ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని రేవంత్ తొడగొట్టారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బదిలీల బాగోతంపైనా ఎలాంటి విచారణకైనా తాము భయపడేది లేదని స్పష్టం చేస్తూ విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అసలు ఈ వివాదానికి కేంద్ర బిందువైన హిల్ట్ పాలసీతో హైదరాబాద్ ముఖచిత్రమే పూర్తిగా మారిపోనుంది. బాలానగర్, కూకట్పల్లి, జీడిమెట్ల, కాటేదాన్, చర్లపల్లి వంటి 22 పారిశ్రామిక వాడల్లోని సుమారు 9,292 ఎకరాల భూముల్లో.. ఖాయిలా పడిన, కాలుష్య కారక పరిశ్రమలు ఉన్న 4,740 ఎకరాల భూములను ఇతర వాణిజ్య, నివాస అవసరాలకు వాడుకునేలా నవంబర్ 22న ప్రభుత్వం జీవో 27 జారీ చేసింది. దశాబ్దాలుగా నగర పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాలుష్య భూతాలను ఓఆర్ఆర్ అవతలకు పంపించే సాకుతో, వాస్తవానికి ఈ వేలాది ఎకరాల బంగారు లాంటి భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ పార్కులు నిర్మించి వేల కోట్లు దండుకునేందుకు భారీ స్కెచ్ గీశారన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ. నగరంలో సెంటు భూమి లక్షల్లో పలుకుతున్న తరుణంలో ఏకంగా వేలాది ఎకరాలు కమర్షియల్ జోన్‌గా మారనుండటంతో రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎక్కడా లేని ఆసక్తి నెలకొంది.
అయితే, జనసాంద్రత విపరీతంగా పెరిగిపోయిన ప్రాంతాల్లో ఇంకా పాతకాలపు టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమల వల్ల జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాట వాస్తవమే. ఉమ్మడి రాష్ట్రంలో 2013లోనే జీవో 20 ద్వారా వీటిని తరలించే ప్రయత్నం జరిగినా, ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొద్దిపాటి పరిశ్రమలనే తరలించగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఈ తరలింపు కార్యక్రమానికి స్పీడ్ పెంచింది. ఒకవైపు వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ బూమ్.. మరోవైపు కాలుష్య రహిత హైదరాబాద్ అనే పర్యావరణ నినాదం.. వెరసి ‘హిల్ట్’ పాలసీ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో అత్యంత హాట్ టాపిక్. దర్యాప్తు సంస్థల విచారణకు సై అంటూ ముఖ్యమంత్రి చేసిన సవాల్‌తో ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులో పడింది. ఈ పొలిటికల్ హైడ్రామా ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే!








