Mahaa Daily Exclusive

  గల్ఫ్ యుద్ధంపై భారత్ మాస్టర్ స్ట్రోక్: అమెరికా గ్యాస్‌తో వంటగదికి భరోసా.. ఇంధన భద్రతలో సరికొత్త చరిత్ర!

Share

గల్ఫ్ మంటల్లోనూ చల్లని కబురు.
* అమెరికా నుంచి ఎల్పీజీ..
* ఇంధన భద్రతలో భారత్ వ్యూహాత్మక విజయం!
ఢిల్లీ, మహా.

మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముడిచమురు, గ్యాస్ సరఫరాలకు కీలకమైన గల్ఫ్ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లుతుంటే, ఆ ప్రభావం సామాన్యుడి వంటగదిపై పడుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి గుండా నౌకలు వెళ్లాలంటేనే భయపడుతున్న ఈ గడ్డు కాలంలో, భారతదేశం వేసిన మాస్టర్ స్ట్రోక్ దేశ ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. గల్ఫ్ కష్టాలకు ఏమాత్రం బెదరకుండా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధన భద్రతను ఖాయం చేసుకున్న తీరు ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

**టెక్సాస్ నుంచి నిరాటంకంగా గ్యాస్ సరఫరా**

గల్ఫ్ దేశాలపైనే పూర్తిగా ఆధారపడకుండా, సుదూర ప్రాంతమైన అమెరికాలోని టెక్సాస్ నుంచి భారత్ ఎల్పీజీని దిగుమతి చేసుకోవడం ఈ వ్యూహంలో అత్యంత కీలకమైన అడుగు. అమెరికా నుంచి 16,714 టన్నుల ఎల్పీజీతో బయలుదేరిన భారీ నౌక ‘పిక్సిస్ పయనీర్’ ఎలాంటి ఆటంకాలు లేకుండా కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, దేశంలో ఎల్పీజీ కొరత ముప్పును శాశ్వతంగా తప్పించేలా రానున్న వారంలో ఏకంగా 72,700 టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 25న ‘అపోలో ఓషన్’ నౌక ద్వారా 26,687 టన్నులు, ఆ తర్వాత 29న మరో నౌక ద్వారా ఏకంగా 30 వేల టన్నుల ఎల్పీజీ భారత తీరాన్ని తాకనుంది.

**ఆర్థిక భారాన్ని తగ్గించిన చారిత్రాత్మక నిర్ణయం**

సాధారణంగా ఇలాంటి భౌగోళిక రాజకీయ సంక్షోభ సమయాల్లో బీమా ఖర్చులు, రవాణా ఛార్జీలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ భారం అంతిమంగా సామాన్య వినియోగదారుడిపై పడుతుంది. ఇక్కడే కేంద్ర ప్రభుత్వం తన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంధన కంపెనీలకు అండగా నిలుస్తూ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీ రవాణాపై కార్గో ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో గ్యాస్ ధరలు స్థిరంగా ఉండేందుకు మార్గం సుగమమైంది.

**నావికుల భద్రతకు కొండంత భరోసా**

ఒకవైపు ఇంధన భద్రతను నిర్ధారిస్తూనే, మరోవైపు ప్రాణ భయంతో ఉన్న నావికుల కుటుంబాలకు ప్రభుత్వం కొండంత భరోసానిచ్చింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మన 22 నౌకలు, అందులోని 611 మంది భారతీయ నావికులు పూర్తి సురక్షితంగా ఉన్నారని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా స్పష్టం చేశారు. గత 24 గంటల్లో సముద్రంలో ఎలాంటి దాడులు జరగలేదని, రేవుల్లో రద్దీ లేదని, పరిస్థితిని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అంతర్-మంత్రిత్వ శాఖల సమావేశంలో ఆయన దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. సముద్రాలపై మన నావికుల భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

**అదుపులోకి వచ్చిన ప్యానిక్ బుకింగ్స్**

ప్రభుత్వ చర్యలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు పూర్తిగా కుదుటపడ్డాయి. యుద్ధం మొదలైన కొత్తలో గ్యాస్ దొరకదేమోనన్న భయంతో వినియోగదారులు ఎగబడి బుకింగ్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్యానిక్ బుకింగ్స్ గణనీయంగా తగ్గిపోయాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. సంక్షోభం ప్రారంభ రోజులతో పోలిస్తే గురువారం నాటికి కేవలం 55 లక్షల బుకింగ్‌లు మాత్రమే నమోదవడం, దేశంలో ఎల్పీజీ సంక్షోభం పూర్తిగా అదుపులోకి వచ్చిందనడానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Latest