Mahaa Daily Exclusive

  ఇంధన భయం వద్దు.. మాంద్యం ముప్పు రానివ్వం.

Share

  • గల్ఫ్‌లో మనవాళ్లకు అండగా ఉంటాం.
  • పెట్రోల్, డీజిల్ సరఫరాపై లోక్‌సభలో ప్రధాని భరోసా.

ఢిల్లీ, మహా.

పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ, ఈ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ యుద్ధం భారతదేశానికి భౌగోళికంగా, ఆర్థికంగా ఎన్నో సవాళ్లను తెచ్చిపెట్టిందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం అత్యంత కష్టతరంగా మారిందని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ, దేశంలో సామాన్యుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని ప్రధాని దేశ ప్రజలకు కొండంత భరోసా ఇచ్చారు. దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ), పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం రాకుండా చూసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. మన దేశ ఇంధన అవసరాల కోసం ఏకంగా 41 దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, అందుకోసం చమురు సరఫరా చేసే దేశాలతో భారత ప్రభుత్వం నిరంతరం దౌత్యపరమైన సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. అంతేకాకుండా, మనకు అవసరమైన ఎల్పీజీలో 60 శాతం ఉత్పత్తిని దేశీయంగానే సాధిస్తున్నామని, అందువల్ల గ్యాస్ కొరతకు ఆస్కారమే లేదని ప్రధాని తేల్చిచెప్పారు.
పశ్చిమాసియాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే సుమారు 3 లక్షల 75 వేల మంది భారతీయులను అత్యంత సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చామని ఆయన సభకు వివరించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో ఉన్న దాదాపు కోటి మంది భారతీయుల భద్రత పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, వారికి ఏ సమయంలోనైనా సహాయం అందించేందుకు వీలుగా 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న పౌరులకు అండగా నిలవడం కేంద్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
మరోవైపు, అంతర్జాతీయంగా నెలకొన్న ఈ ఉద్రిక్త వాతావరణం వల్ల ప్రపంచానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అయితే, ఆ మాంద్యం ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఏమాత్రం పడకుండా ఉండేందుకు అన్ని రకాల కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తూ, మనం మొదటి నుంచి యుద్ధాలకు వ్యతిరేకమని ప్రధాని కుండబద్దలు కొట్టారు. సమస్యలు ఎంత తీవ్రమైనవైనా.. పంతాలకు పోయి చేసే దాడులతో ఏ సమస్యా పరిష్కారం కాదని, కేవలం సామరస్య పూర్వక చర్చల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు హితవు పలికారు. మొత్తంగా చూస్తే, గల్ఫ్‌లో మన పౌరుల భద్రత నుంచి సామాన్యుడి వంటగ్యాస్ వరకు ప్రధాని చేసిన ఈ ప్రసంగం.. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వ్యూహాన్ని, దృఢ సంకల్పాన్ని స్పష్టం చేసింది.

Latest