మూసీ ప్రక్షాళన ఆగదు.. నిర్వాసితులకు అండగా ఉంటాం!
* ఎవరినీ నిరాశ్రయులను చేయం.. మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తాం.
* ప్రాజెక్టు ఆపొద్దు.. నిర్మాణాత్మక సలహాలివ్వండి.
* సూచనల స్వీకరణకు డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
* నగరంలో కాలుష్యానికి చెక్.. ఓఆర్‌ఆర్ ఆవలకే పరిశ్రమలు.
* శాసనమండలిలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి విజన్ వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
చారిత్రక హైదరాబాద్ మహానగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మూసీ ప్రక్షాళన’ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఏ ఒక్కరినీ నిరాశ్రయులను చేయబోమని, వారికి నష్టం జరగకుండా మరింత మెరుగైన వసతులతో ప్రభుత్వమే స్వయంగా పునరావాసం కల్పిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా, సమగ్రంగా సమాధానమిచ్చారు. లక్ష చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించిన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనికతను, నగర భవిష్యత్తు ప్రణాళికలను ఆయన సభ ముందు ఉంచారు.
మూసీ ప్రక్షాళనను కేవలం నగర సమస్యగానే చూడొద్దని ముఖ్యమంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మూసీ కాలుష్యంతో దశాబ్దాలుగా నల్గొండ ప్రజలు పడుతున్న ఆవేదనాభరితమైన జీవిత సత్యాలను అర్థం చేసుకుంటే ఎవరూ ఈ ప్రాజెక్టును ఆపాలని కోరరని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన ప్రణాళికలను క్షుణ్ణంగా చదివి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆ సూచనలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన ఓ మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తున్నట్లు సీఎం సభలో అధికారికంగా ప్రకటించారు.
దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు ఎదుర్కొంటున్న విషమ పరిస్థితులను సీఎం ఈ సందర్భంగా ఉదహరించారు. దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం, ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలొస్తే మునిగిపోయే పరిస్థితి, బెంగళూరులో ట్రాఫిక్ జామ్‌లు, భారీ వర్షాలకు చెన్నైలో పడవలపై ప్రయాణించాల్సిన దుస్థితిని మనం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భౌగోళికంగా ఎలాంటి లోపం లేని, ప్రశాంత వాతావరణం ఉన్న చారిత్రక హైదరాబాద్ నగరం నేడు కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోందంటే అది ముమ్మాటికీ మానవ తప్పిదమేనని ఆయన విశ్లేషించారు. కుతుబ్ షాహీల కాలం నాటి గుల్జార్ హౌజ్, ఫలక్‌నుమా, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు వంటి ఎంతో చరిత్ర కలిగిన అద్భుతమైన కట్టడాలతో ఒకప్పుడు ‘లేక్ అండ్ రాక్ సిటీ’గా విలసిల్లిన నగరానికి ఆ పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ రెడ్డి సభకు వివరించారు. రాష్ట్రాన్ని క్యూర్ , ప్యూర్ , రేర్ అనే మూడు ప్రాంతాలుగా విభజించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దాదాపు 1.34 కోట్ల జనాభా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించామని, కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ జోన్ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించి, ఈ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ‘హిల్ట్ పాలసీని తీసుకొచ్చిందని, దీని ద్వారా పాత పారిశ్రామిక భూములను మల్టీయూజ్ జోన్లుగా మార్చుతామని వివరించారు. తద్వారా వాటి యాజమాన్య హక్కులు మారకుండానే ఆ ప్రాంతాలు మధ్యతరగతి నివాస యోగ్యంగా మారతాయని చెప్పారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలో భాగంగా గోదావరి నుంచి 20 టీఎంసీల జలాలను తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో 17 టీఎంసీలను జంటనగరాల తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని, మిగిలిన 3 టీఎంసీల నీటిని మూసీ నదిలో నిరంతరం ప్రవహించేలా పంపుతామని ముఖ్యమంత్రి సభకు సవివరంగా తెలియజేశారు.








