Mahaa Daily Exclusive

  తమిళనాట ఖరారైన ఎన్డీఏ సీట్ల పంపకాలు: 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 సీట్లలో బీజేపీ పోటీ!

Share

తమిళనాట ఎన్డీఏ పొత్తులు ఖరారు.
• అన్నాడీఎంకే 178, బీజేపీ 27, పీఎంకే 18.. కొలిక్కివచ్చిన సీట్ల పంపకాలు.
* కమలానికి పెరిగిన బలం.. గత ఎన్నికల కంటే ఏడు సీట్లు అదనం!
* డీఎంకే గద్దె దిగడం ఖాయం.. ఎన్డీఏదే విజయం.
* పీయూష్‌ గోయల్‌
హైదరాబాద్, మహా.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) సర్వసన్నద్ధమైంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎట్టకేలకు సోమవారం కొలిక్కివచ్చింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 27 శాసనసభ స్థానాలను కేటాయించేందుకు ప్రధాన మిత్రపక్షమైన అన్నాడీఎంకే అంగీకరించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈసారి ఏకంగా ఏడు సీట్లు అదనంగా దక్కడం విశేషం. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కే. పళనిస్వామి (ఈపీఎస్) లాంఛనంగా ఈ ఎన్నికల ఒప్పందంపై సంతకాలు చేశారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే అత్యధికంగా 178 స్థానాల్లో పోటీ చేయనుంది. మిత్రపక్షాలైన బీజేపీకి 27, అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకేకు 18, టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలోని ఏఎంఎంకే పార్టీకి 11 స్థానాలను కేటాయించారు. సీట్ల పంపకాల ప్రకటన అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని డీఎంకే నాశనం చేసిందని, ఆ పార్టీ పాలన పట్ల ప్రజలు తీవ్ర విసుగుతో ఉన్నారని ఆయన విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారని.. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ నాయకత్వంలో రాష్ట్రంలో రైతులు, యువత, మహిళల అభివృద్ధికి బాటలు వేసే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గుచూపుతున్నారని గోయల్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి, ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Latest