Mahaa Daily Exclusive

  దలాల్ స్ట్రీట్‌లో ‘బ్లడ్ బాత్’: కుప్పకూలిన సూచీలు.. ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల సంపద ఆవిరి!

Share

స్టాక్ మార్కెట్లలో ‘బ్లడ్ బాత్’.. ఆవిరైన లక్షల కోట్లు!
* కుప్పకూలిన దేశీయ సూచీలు.. 1,836 పాయింట్ల నష్టంతో 72,696 వద్ద ముగిసిన సెన్సెక్స్.
* 601 పాయింట్లు పతనమై 22,512 వద్ద స్థిరపడిన నిఫ్టీ.
* ఇవాళ ఒక్కరోజే మదుపరులకు రూ.14.19 లక్షల కోట్ల భారీ నష్టం.
* గత 15 సెషన్లలో ఏకంగా రూ.47.53 లక్షల కోట్ల సంపద ఆవిరి.
* దలాల్ స్ట్రీట్‌లో నెలకున్న తీవ్ర ఆందోళన.
ముంబై,మహా.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ‘బ్లడ్ బాత్’ నెలకొంది. దలాల్ స్ట్రీట్ నెత్తురోడింది. వరుస నష్టాలతో సతమతమవుతున్న మదుపరులకు తాజా పతనం కోలుకోలేని దెబ్బతీసింది. దేశీయ సూచీలు ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువ కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడలా కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల సంపద క్షణాల్లో కరిగిపోయింది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.14.19 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడం మార్కెట్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉదయం లాభాలతో ప్రారంభమవుతాయని ఆశించిన మదుపరులకు మార్కెట్లు కోలుకోలేని షాక్ ఇచ్చాయి.
గత 15 సెషన్ల ట్రేడింగ్ చరిత్రను పరిశీలిస్తే.. స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా మదుపరులు ఏకంగా రూ.47.53 లక్షల కోట్ల మేర నష్టపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ భారీ పతనంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,836 పాయింట్ల భారీ నష్టంతో 72,696 వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 601 పాయింట్లు పతనమై 22,512 వద్ద స్థిరపడింది. అన్ని రంగాల షేర్లలోనూ భారీగా అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు కోలుకోలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, లాభాల స్వీకరణకు దిగడం వంటి పరిణామాలు దేశీయ సూచీల పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా వరుస నష్టాలతో లక్షల కోట్లు ఆవిరైపోతుండటంతో చిన్న మదుపరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest