Mahaa Daily Exclusive

  పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు వీడాయి: ఇరాన్‌పై దాడులు నిలిపివేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం!

Share

ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ బ్రేక్.
* పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం.
* ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.
* రెండు రోజులుగా సాగిన దౌత్య చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయని వెల్లడి.
* పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తామన్న అగ్రరాజ్యాధినేత. ట్రూత్ సోషల్ వేదికగా నిర్ణయం వెల్లడి.

హైదరాబాద్, మహా.

ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకుని భయపెడుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై గడచిన మూడు వారాలుగా విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్ తీసుకున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లను సమూలంగా ధ్వంసం చేస్తామంటూ విధించిన 48 గంటల అల్టిమేటం గడువు ముగియకముందే ఆయన ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత రెండు రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య తెరవెనుక జరిగిన దౌత్యపరమైన చర్చలు అత్యంత సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగాయని ట్రంప్ తన పోస్ట్‌లో వెల్లడించారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ఉద్దేశంతోనే తాము ఈ చర్చల్లో పాల్గొన్నామని, ఈ వారమంతా ఈ మంతనాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అగ్రరాజ్యం, ఇరాన్ మధ్య నెలకొన్న శత్రుత్వానికి పూర్తిస్థాయి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయని, అందుకే దాడులను తాత్కాలికంగా వాయిదా వేయాలని రక్షణ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ వివరించారు. పశ్చిమాసియాలో శాంతి సామరస్యాల కోసం అమెరికా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఒకవైపు గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ, ఇరాన్‌పై దాడుల వాయిదా వార్త ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా ఇంధన మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది.

Latest