- మరణించినా వీడని బంధం.
- విగ్రహాల రూపంలో ఏటా ‘ప్రేమ’ కల్యాణం!
- 22 ఏళ్ల క్రితం తనువు చాలించిన జంట.
- నేటికీ సజీవంగా జ్ఞాపకాలు
- అనాడు అడ్డుకున్న చేతులే…నేడు పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి…మహబూబాబాద్‌లో వింత ఉదంతం
మహబూబాబాద్, మహా.
“బాజాభజంత్రీలు మోగుతున్నాయి.. వేద మంత్రాల సాక్షిగా పచ్చని పందిరిలో పెళ్లి వేడుక కళ్లకు కడుతోంది. కానీ, ఆ పెళ్లి పీటల మీద ఉంది రక్తమాంసాలతో కూడిన మనుషులు కాదు.. మట్టితో చేసిన విగ్రహాలు. నూరేళ్లూ కలిసి ఉండాల్సిన ఆ జంటను నాడే ఒకటి చేసి ఉంటే.. నేడు ఈ ఆవేదన ఉండేది కాదేమో అన్న రిగ్రెక్ట్ ఆ కన్నవారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. 22 ఏళ్ల క్రితం తాము చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా.. మరణించిన కొడుకు కోరికను తీర్చేందుకు ఆ తల్లిదండ్రులు చేస్తున్న ఈ ‘కల్యాణ ప్రయత్నం’ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.” మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఉదంతం సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.
**ఆనాటి నిరాకరణ.. నేటి ఆవేదన**
వివరాల్లోకి వెళితే.. సంతులాల్ పోడు తండాకు చెందిన రామ్ కోటి అనే యువకుడు 22 ఏళ్ల క్రితం ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డాడు. అయితే, ఆనాటి సామాజిక పరిస్థితులు, పెద్దల పట్టింపులు వారి ప్రేమకు అడ్డుగోడలయ్యాయి. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ ప్రేమజంట, విడిపోయి జీవించలేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. బలవన్మరణానికి పాల్పడి అనంత వాయువుల్లో కలిసిపోయింది.
**ఇంటి ఆవరణలోనే ‘ప్రేమ’ మందిరం**
ఒక్కగానొక్క కొడుకు మరణం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది. తాము అడ్డు చెప్పడం వల్లే పచ్చని ప్రాణాలు బలైపోయాయన్న అపరాధ భావం వారిని నీడలా వెంటాడింది. ఆ ఆవేదన నుంచే ఒక వినూత్న ఆలోచన పుట్టింది. తమ ఇంటి ఆవరణలోనే కొడుకు రామ్ కోటి గుర్తుగా ఒక చిన్న గుడిని కట్టించారు. అందులో కొడుకు విగ్రహంతో పాటు, అతను ప్రేమించిన యువతి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. బతికి ఉన్నప్పుడు వారిని ఒకటి చేయలేకపోయినా, కనీసం విగ్రహాల రూపంలోనైనా వారిని కలిపి ఉంచాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
**ఏటా శ్రీరామ నవమినాడు వివాహం**
అంతటితో ఆగకుండా, ప్రతీ ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ విగ్రహాలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తున్నారు. కొత్త బట్టలు పెట్టి, తలంబ్రాలు పోసి, మంగళవాయిద్యాల మధ్య ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. తమ చేతుల మీదుగా ఒకటి కాలేకపోయిన ఆ జంటను, కనీసం ఈ రూపంలోనైనా కలిపి చూసుకోవడంలో ఆ తల్లిదండ్రులు ఒక రకమైన సంతృప్తిని పొందుతున్నారు. ఈ ఏడాది కూడా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియోలు చూసి, “ప్రేమను కాదనడం వల్ల కలిగే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ దృశ్యాలే నిదర్శనం” అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.







