ఇంట్లో ‘సిద్ధార్థ’ హస్తం.
* రూ.25 లక్షల సొత్తుతో మైనర్ పలాయనం.
* ‘సారీ నాన్న’ అంటూ లేఖ..
* నగదు, బంగారంతో బైక్‌పై ఉడాయింపు.
* ఆందోళనలో తల్లిదండ్రులు
హైదరాబాద్, మహా.
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీలో ఓ మైనర్ బాలుడి ఉదంతం స్థానికంగా పెను కలకలం రేపింది. కన్నవారి కళ్లు గప్పి, ఇంట్లోని భారీ నగదు, బంగారంతో ఒక మైనర్ బాలుడు పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన నాగార్జున రెడ్డి కుమారుడు సిద్ధార్థ్ రెడ్డి (17) గురువారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కేవలం వెళ్లడమే కాకుండా, ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 9 తులాల బంగారు ఆభరణాలు, రూ. 8 లక్షల నగదును తన వెంట తీసుకెళ్లాడు. అదనంగా తన తండ్రికి చెందిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను కూడా తీసుకుని ఉడాయించాడు. పారిపోయిన సొత్తు మొత్తం విలువ సుమారు రూ. 25 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ‘సారీ నాన్న’ అంటూ ఓ చిన్న కాగితంపై రాసిపెట్టిన సిద్ధార్థ్, తన తండ్రి బైక్‌ను ఎక్కడో ఒకచోట వదిలేస్తానని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం బాలుడి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో, అతడు ఎక్కడ ఉన్నాడో తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే సిద్ధార్థ్ ఇలా పారిపోవడం ఇదేం మొదటిసారి కాదని, గతంలోనూ రెండు సార్లు ఇలాగే ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి, కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇంటికి చేరుకున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. కానీ ఈసారి ఏకంగా భారీ మొత్తంలో డబ్బు, నగలు తీసుకెళ్లడంతో ఏదైనా అపాయం జరుగుతుందేమోనని వారు భయాందోళన చెందుతున్నారు.
తమ కుమారుడు కనిపించడం లేదని, ఇంట్లోని విలువైన సొత్తు పోయిందని నాగార్జున రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేపీహెచ్‌బీ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుతో పాటు చోరీ కేసును కూడా నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తూ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పదే పదే పలాయనం చిత్తగిస్తున్న ఈ మైనర్ బాలుడి నిర్వాకం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాధితులకు భరోసా కల్పిస్తూ, వీలైనంత త్వరగా బాలుడిని పట్టుకుని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని స్పష్టం చేశారు. ఒకే ఇంట్లో మూడుసార్లు ఇలాంటి ఘటన జరగడం పట్ల కౌన్సెలింగ్ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








