- అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు:
- కాంగ్రెస్ హయాంలో పారదర్శక పాలనకే పెద్దపీట
- 10ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన కుంభకోణాలపై విచారణ
- మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. బడంగ్ పేట డిప్యూటీ కమీషనర్ కార్యాలయంలో జరిగిన బిల్లుల కుంభకోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపి 10 మంది అధికారులను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరిగినా… అధికారులు సహా సంబంధిత వ్యక్తులు, కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గత బీఆర్ఎస్ పాలనలో అధికారులపై ఒత్తిడి చేసి నాయకులు అవినీతికి పాల్పడ్డారని… ఆ పాపం అధికారులకు అంటుకుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడా లంచం లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పనులు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని లక్ష్మారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి సహా అన్నింటినీ… నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని కిచ్చెన్నగారు తెలిపారు.







