- ఈగల్ పంజా
- రిసార్టులో డ్రగ్స్ పార్టీపై ఈగల్ టీం దాడులు
- టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్
హైదరాబాద్, మహా : నగరంలో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఈసారి గోల్కొండ పరిధిలోని తారామతి బారాదరి రిసార్టులో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌పై తెలంగాణ ఈగల్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో చంద్ర అనే వ్యక్తి నిర్వహించిన ఈ పార్టీకి సుమారు 200 మంది హాజరయ్యారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ పోలీసుల అనుమతి లేకుండానే ఈ వేడుకను ప్రారంభించినట్లు సమాచారం. మద్యం వినియోగానికి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉన్నప్పటికీ, డ్రగ్స్ వినియోగదారుల సస్పెక్ట్ షీట్‌లో ఉన్న వ్యక్తులు ఈ పార్టీకి హాజరైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఈగల్ టీం డీఎస్పీ భిక్షపతి నేతృత్వంలోని బృందం గోల్కొండ పోలీసులతో కలిసి శనివారం రాత్రి అక్కడికి చేరుకుని ఒక్కసారిగా రిసార్టును ముట్టడించారు. ఎవరూ తప్పించుకోకుండా పకడ్బందీగా దాడులు నిర్వహించి, అనుమానం ఉన్న 36 మందికి డ్రగ్ కిట్లతో ఈగల్ టీం పరీక్షలు నిర్వహించింది.
డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, పరం సి నిహార్, ఆశి, జాసన్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ పార్టీలు నిర్వహించారా? ఎవరెవరికి విక్రయించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.








