Mahaa Daily Exclusive

  భద్రాచలం పంచగ్రామాలను విలీనం చేయండి..! అమిత్‌ షాకు మంత్రి తుమ్మల లేఖ..!

Share

  •  అమిత్‌ షాకు మంత్రి తుమ్మల లేఖ!
  •  పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కలపాలని విన్నపం.
  •  గిరిజనుల ఇబ్బందులు తొలగేలా పార్లమెంటులో బిల్లు పెట్టండి.

హైదరాబాద్‌,మహా.

భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉండి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్ సందర్భంగా గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిసిన పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల గ్రామాలను భద్రాచలంలో విలీనం చేయడం వల్ల గిరిజనుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా పరిపాలనా పరమైన ఇబ్బందులను అధిగమించడానికి, భద్రాచలం పట్టణ విస్తరణకు మరియు గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందించడానికి ఈ విలీనం అత్యంత ఆవశ్యకమని తుమ్మల తన లేఖలో స్పష్టం చేశారు.

ఈ ఐదు గ్రామాల ప్రజలు భౌగోళికంగా భద్రాచలం పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నప్పటికీ, పరిపాలనా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఆధారపడాల్సి రావడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంక్షేమ పథకాల అమలులో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వివరించారు. భద్రాచలం పట్టణానికి చుట్టూ భూమి లేకపోవడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, పట్టణ విస్తరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ ఐదు గ్రామాలను కలిపితేనే ఆ సమస్య తీరుతుందని పేర్కొన్నారు. వీరి చిరకాల వాంఛను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ ఐదు గ్రామాల విలీనానికి సంబంధించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల కేంద్ర హోంమంత్రిని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ పలుమార్లు ఈ అంశంపై వినతులు అందినప్పటికీ కార్యరూపం దాల్చలేదని, ఇప్పుడు కేంద్రం చొరవ తీసుకుంటే సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలీనం జరిగితే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం సదుపాయాలు కల్పించడానికి మరింత వెసులుబాటు కలుగుతుందని మంత్రి తన లేఖలో కేంద్రానికి వివరించారు.

Latest