Mahaa Daily Exclusive

  దీదీకి కౌంట్‌డౌన్ షురూ..! బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగార్యాలీలో ప్రధాని మోడీ..

Share

  • రాష్ట్రంలో ‘మహ’ ఆటవిక రాజ్యం’ నడుస్తోంది
  • మమత మూల్యం చెల్లించుకోవాల్సిందే
  • ఎన్నికల తర్వాత బెంగాల్ నుంచి భయం పోతుంది
  • బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగార్యాలీలో ప్రధాని మోడీ

కోల్ కతా, మహా : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వెడెక్కింది. కూచ్‌బిహార్‌లో ఆదివారం జరిగిన మెగా ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా, సందేశ్‌కాళి ఘటనలపై ప్రధాని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ‘మహా ఆటవిక రాజ్యం’ నడుస్తోందని, ఈ ఘటనలను టీఎంసీ బాధ్యత వహించాలన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పశ్చిమబెంగాల్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ప్రధాని విమర్శించారు. బెంగాల్ ప్రజలను టీఎంసీ లూటీ చేసిందని, మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు.

 

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్

 

కేంద్రంలోని బీజేపీ ఇంత వరకూ 3 లక్షల మంది సోదరీమణులను కరోడ్‌పతి దీదీలను చేసిందని, దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకోసం తమ ప్రభుత్వం మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం తెచ్చిందని చెప్పారు. ఇందువల్ల 2020 లోక్‌సభ ఎన్నికల నుంచి పశ్చిమబెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఏప్రిల్ 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నామని చెప్పారు. మన తల్లులు, సోదరీమణులకు 40 ఏళ్లుగా చట్టసభల్లో రిజర్వేషన్ హక్కు లేకుండా పోయిందని, ఇంకా జాప్యం జరగడం సరికాదని అన్నారు. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు ఇందువల్ల ఎలాంటి నష్టం జరగదని, అన్ని రాష్ట్రాలు, అందరి హక్కుల పరిరక్షణ జరుగుతుందని భరోసా ఇచ్చారు.

 

టీఎంసీ సిండికేట్‌కు భయపడొద్దు

 

పోలింగ్ రోజున టీఎంసీ గూండాలకు భయపడవద్దని, చట్టాన్ని నమ్మండని మోదీ కోరారు. మే 4న టీఎంసీ పాలన ముగియగానే ఆ పార్టీ గూండాలు, సిండికేట్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. చొరబాటుదారులను కాపాడేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియను టీఎంసీ వ్యతిరేకిస్తోందని, రాబోయే ఎన్నికలు టీఎంసీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని, ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ స్వేచ్ఛగా, సజావుగా నిర్వహిస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

 

బెంగాల్‌లో ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బంగాల్‌ నుంచి భయం పారిపోతుందన్నారు. కూచ్‌ బెహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ, టీఎంసీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కల్పించిన బంగాల్‌ను టీఎంసీ సర్కార్‌ వలసలకు కేంద్రంగా మార్చిందని దుయ్యబట్టారు. బంగాల్‌లో శాంతిభద్రతలకు అంతిమ యాత్ర నిర్వహించేందుకు టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని విమర్శించారు.

 

ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్కతేల్చి శిక్షిస్తామన్నారు. ఈ ఎన్నికలు అధికార పక్షం వ్యాపింపజేస్తున్న భయం, బీజేపీ కల్పిస్తున్న భరోసా మధ్య పోరుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా గ్రేట్‌ బంగాల్‌ తన గుర్తింపు కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాటుదారులను రక్షించేందుకు ఎస్ఐఆర్, , సీఏఏను టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బెంగాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నికల తర్వాత టీఎంసీ పాపాల లెక్క తేల్చటమే కాకుండా బాధ్యులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

Latest