Mahaa Daily Exclusive

  డ్రగ్స్ వద్దు.. క్రీడలే ముద్దు.. గచ్చిబౌలి మైదానంలో సీఎం రేవంత్..

Share

  • గచ్చిబౌలి మైదానంలో సీఎం రేవంత్.
  •  హైదరాబాద్‌కు పూర్వవైభవం తెచ్చేలా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’.
  •  డ్రగ్స్ సంస్కృతిని తరిమికొట్టి.. మైదానాల్లోకి యువతను రప్పిస్తాం.
  •  మెస్సీ స్ఫూర్తితో గెలుపు బాట పట్టాలి.. క్రీడాకారులకు ఉద్యోగాల గ్యారెంటీ.

హైదరాబాద్, మహా.

“ఒకప్పుడు భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో హైదరాబాద్‌కు సాటిలేదు.. 1950-60 దశకాల్లో మన నగరాన్ని ‘న‌ర్శరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్‌’ అని పిలిచేవారు. 1956 ఒలింపిక్స్‌లో ఆడిన భారత జట్టులో ఏడుగురు మన హైదరాబాద్ వాసులే ఉండటం మన గర్వకారణం. ఆ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎన్ మల్లిక్ స్పై మాస్టర్‌గా నిఘా వ్యవస్థకు చేసిన సేవలను స్మరించుకున్న సీఎం, టోర్నీలో పాల్గొన్న 34 జట్లను అభినందించారు.

 

**దక్షిణ కొరియా స్ఫూర్తితో స్పోర్ట్స్ వర్సిటీ**

 

యువత క్రీడలకు దూరమవ్వడం పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. “ఇటీవల నేను దక్షిణ కొరియా పర్యటనలో అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని చూశాను. కేవలం 30 ఎకరాల్లో ఉన్న ఆ వర్సిటీ ఎన్నో బంగారు పతకాలను సాధించింది. 4 కోట్ల జనాభా ఉన్న ఆ దేశం 30కి పైగా పతకాలు సాధిస్తుంటే.. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం మాత్రం పతకాల కోసం వెనుకబడిపోతోంది. అక్కడ ఒక్క అమ్మాయి రెండు గోల్డ్ మెడల్స్ గెలిచింది. అందుకే, అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలతో కూడిన బోర్డును నియమించి, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో దీనిని నడుపుతాం” అని వెల్లడించారు.

 

**డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం**

 

నేటి తరం యువత పబ్‌లు, డ్రగ్స్ సంస్కృతిలోకి వెళ్లడంపై సీఎం తీవ్రంగా స్పందించారు. “యువత క్రీడా మైదానాలను వదిలి తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. పంజాబ్ యువత ఒకప్పుడు దేశం కోసం వీరులను అందించింది, కానీ ఇప్పుడు డ్రగ్స్ బారిన పడింది. తెలంగాణను మరో పంజాబ్ కానివ్వం. బాగా చదువుకున్న వారే ఈ ఉచ్చులో పడటం బాధాకరం. పోలీసులకు ఇప్పుడు నేరాల తీరు మారింది. ఏఐ

ఒక వైపు ఉపయోగకరంగా ఉన్నా, మరోవైపు డబుల్ ఎడ్జ్ వెపన్‌లా మారి సైబర్ నేరాలకు దారితీస్తోంది. డ్రగ్స్, సైబర్ నేరాలను అణచివేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది” అని హెచ్చరించారు.

 

**మెస్సీతో స్ఫూర్తి.. క్రీడాకారులకు కొలువుల భరోసా**

 

యువతకు సరైన దిశానిర్దేశం చేసేందుకే అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చామని, ఎస్సీ, ఆదివాసీ పిల్లలు ఆయనతో కలిసి ఆడే అవకాశం కల్పించామని సీఎం గుర్తు చేశారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం ఇచ్చే గౌరవాన్ని వివరిస్తూ.. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగంతో పాటు 2 కోట్ల నగదు పురస్కారం ఇచ్చామని తెలిపారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు నిబంధనలు సడలించి డీఎస్‌పీ ఉద్యోగం ఇచ్చామని, పారా ఒలింపియన్ దీప్తి జీవన్జీకి కూడా గ్రూప్-1 ఉద్యోగం కల్పించామని పేర్కొన్నారు. “క్రీడల్లో రాణించే ప్రతి తెలంగాణ బిడ్డకు ఉద్యోగం గ్యారెంటీ.. ఇది నా హామీ” అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Latest