- లేఖలకే పరిమితమైన కార్యాచరణ!
- ముఖ్యమంత్రి ఆదేశించినా కదలని ఫైళ్లు.
- నిర్మాణ సంస్థకు నోటీసులపై జాప్యం.
- డిజైన్ లోపమంటూ తప్పించుకుంటున్న ఎల్ అండ్ టీ.
- విజిలెన్స్, ఘోష్ కమిషన్ నివేదికలు బేఖాతరు.
హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత పూర్తిగా నిర్మాణ సంస్థదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసినా, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రాజెక్టు ఇంజినీర్లు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమవ్వడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశంగా మారింది.
**నెలలు గడుస్తున్నా లేని స్పందన**
నిర్మాణ సంస్థకు తుది నోటీసు జారీ చేయాలని, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కాళేశ్వరం ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) నెల రోజుల క్రితమే చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన 34 రకాల ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను జత చేస్తూ తక్షణ చర్యలకు ఆదేశించినా, ఇప్పటివరకు దానిపై ఎటువంటి స్పందనా కనిపించలేదు. ఈ జాప్యం వెనుక ఉన్న కారణాలపై నీటిపారుదల శాఖ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
**పునరుద్ధరణ బాధ్యత ఎవరిది?**
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పియర్స్ కుంగిపోయి, బీటలు వారిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగంతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా నిర్మాణ లోపాలనే ఎత్తిచూపాయి. నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ – పీఈఎస్ సంస్థలే పునరుద్ధరణ బాధ్యత వహించాలని, ఒకవేళ వారు ముందుకు రాకపోతే ప్రభుత్వమే పనులు పూర్తి చేసి తర్వాత ఆ ఖర్చును వారి నుంచి రికవరీ చేయాలని సిఫార్సు చేశాయి. రెండు కీలక నివేదికలు వచ్చి నెలలు గడుస్తున్నా, అధికారులు మాత్రం ముందడుగు వేయడం లేదు.
**నిర్మాణ సంస్థ మొండివైఖరి**
మరోవైపు, నిర్మాణ సంస్థ తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోంది. బ్యారేజీకి జరిగిన నష్టం డిజైన్ లోపం వల్లేనని, పునరుద్ధరణ బాధ్యత తమది కాదని పేర్కొంటూ ఇప్పటివరకు నీటిపారుదల శాఖకు 21 లేఖలు రాసింది. ప్రభుత్వం ఇప్పటికే సదరు సంస్థకు ఇచ్చిన ‘పని పూర్తి ధ్రువీకరణ పత్రం’రద్దు చేసినా, అనుబంధ ఒప్పందం చేసుకుంటే తప్ప పనులు చేయబోమని సంస్థ తెగేసి చెబుతోంది.
**ఉదాసీనతే శాపమైందా?**
బ్యారేజీ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే లోపాలను గుర్తించి కింది స్థాయి ఇంజినీర్లు (డిప్యూటీ ఈఈలు, ఈఈలు) పై అధికారులకు లేఖలు రాశారు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో ఉన్నప్పుడే ఆ మరమ్మతులు చేయించి ఉంటే బ్యారేజీకి ఇంత నష్టం వాటిల్లేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, పైస్థాయి అధికారులు అప్పట్లో ఆ హెచ్చరికలను బేఖాతరు చేయడమే కాకుండా, పనులు పూర్తయినట్లు ధ్రువీకరణ ఇచ్చి బ్యాంకు గ్యారంటీలను కూడా తిరిగి ఇచ్చేశారు. ఈ లోపాలపై చర్యలకు కమిషన్లు సిఫార్సు చేసినా నీటిపారుదల శాఖ మౌనం వహించడం గమనార్హం.
రెండేళ్లుగా కేవలం లేఖల చుట్టూనే తిరుగుతున్న ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ మంత్రి మరోమారు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభం కాకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








