Mahaa Daily Exclusive

  హోర్ముజ్ తెరవకపోతే ‘నరకమే’..! ఇరాన్‌పై ట్రంప్ నిప్పులు..!

Share

  • ఇరాన్‌పై ట్రంప్ నిప్పులు!
  •  నేటి నుంచి పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు తప్పవు.
  •  సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడి తీవ్ర హెచ్చరిక.

వాషింగ్టన్, మహా.

పశ్చిమాసియాలో హోర్ముజ్ జలసంధిని మూసివేసిన వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ప్రభుత్వంపై ఆయన అసాధారణ రీతిలో విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవకపోతే మంగళవారం నుంచి ఇరాన్ నరకాన్ని చూడబోతోందని, మునుపెన్నడూ చూడని స్థాయిలో ఆ దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా విధించిన గడువును ఇరాన్ బేఖాతరు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలను మరింత దట్టం చేశాయి.

ట్రంప్ తన పోస్ట్‌లో తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ.. “మంగళవారం నుంచి ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, కీలకమైన వంతెనలపై దాడులు మొదలవుతాయి. ఇలాంటి విధ్వంసాన్ని మీరు చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి” అని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలను అడ్డుకోవడంపై అమెరికా తీవ్ర అసహనంతో ఉంది. తాజాగా ఇరాన్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు అమెరికా పైలట్‌లను ఆ దేశ సైన్యం విజయవంతంగా కాపాడిన నేపథ్యంలో, ట్రంప్ తన పాత డెడ్‌లైన్‌ను గుర్తు చేస్తూ ఈ సంచలన పోస్ట్ చేశారు.

ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు నేరుగా దాడుల గురించి ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరగా, ట్రంప్ హెచ్చరికలతో గల్ఫ్ దేశాల్లో ఆందోళన నెలకొంది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం కావడంతో, అక్కడ యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంగళవారం నాటి డెడ్‌లైన్ సమీపిస్తుండటంతో అగ్రరాజ్యం తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

Latest