- సాగునీటి వనరుల్లో పూడిక తీయండి!
- చివరి ఆయకట్టు వరకు నీరందాలి.
- జూరాల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
- తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం.. చెరువులు, ట్యాంకులు నింపాలి.
- అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్, మహా.
రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, పొలాల్లో ఉన్న పంటలు ఎండిపోకుండా చివరి తడి వరకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా యంత్రాంగం కదలాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి వనరుల సంరక్షణ, రబీ పంటల రక్షణపై ఆదివారం ఆయన జలసౌధలో ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోకూడదని, అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను సమర్థంగా వినియోగించాలని ఆదేశించారు. లభ్యమయ్యే నీటిని ఆయకట్టుకు చేర్చడంలో చీఫ్ ఇంజినీర్లు వ్యక్తిగత బాధ్యత వహించాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జలాశయాల్లో నిల్వలను సంరక్షించాలని, కాల్వలు మూసివేసే ముందే చెరువులు, ట్యాంకులను పూర్తిగా నింపాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని 6.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటికే సాగునీటిని సరఫరా చేశామని అధికారులు మంత్రికి వివరించారు. కోతలు పూర్తయిన ప్రాంతాలను మినహాయించి, ఇంకా తడి అవసరమైన పంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నిలిపివేయవద్దని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువుల నిల్వ సామర్థ్యం పెంచేందుకు సమగ్ర ‘డీసిల్టేషన్’ (పూడిక తీత) కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల్లో 30-40 శాతం మేర మట్టి పేరుకుపోయినట్లు సర్వేలు చెబుతున్నాయని, శాస్త్రీయ పద్ధతిలో పూడిక తీత పనులపై తక్షణమే సాధ్యత నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ పంప్‌హౌస్‌ల నిర్వహణపై స్పందిస్తూ.. యంత్రాలకు నష్టం కలగకుండా పంప్‌లను నిరంతరాయంగా నడపాలని, తరచూ ఆన్-ఆఫ్ చేయవద్దని సూచించారు.
జూరాల ప్రాజెక్టు మరమ్మతులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.66 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి పునరుత్పత్తి నీరు ఆశించిన స్థాయిలో రాకపోతే ఏర్పడే లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. గత ఏడాది తరహాలో కర్ణాటక ప్రభుత్వం నుంచి నీటిని సమీకరించే అంశంపై చర్చించారు. జూరాల వద్ద వంతెనతో పాటు చిన్న బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించి, స్థలాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి.. సీడబ్ల్యూపీఆర్ఎస్ నిర్వహిస్తున్న అధ్యయనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సాగునీటి శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, టన్నెల్ ఇంజినీరింగ్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.








