ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ.
* రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు.
* సామాన్య కార్యకర్తలే పార్టీ అసలైన బలం.
* దేశహితమే పరమావధి..
* శ్యామా ప్రసాద్ ముఖర్జీ, వాజ్‌పేయి ఆశయ సాధనే లక్ష్యం.
* తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సిద్ధమవ్వాలి.
* కేడర్‌కు రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పిలుపు.
* వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి: బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు
హైదరాబాద్, మహా.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైభవంగా జరిగాయి. పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మక దినం పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్ రావు, శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సహా పలువురు కీలక నేతలు, వేలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కోట్లాది మంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు. పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది కేవలం సంబరాలు చేసుకునే రోజు మాత్రమే కాదని, ‘దేశమే ప్రథమం’ సిద్ధాంతం పట్ల నిబద్ధత చాటుకునే గర్వకారణమైన రోజని ఉద్ఘాటించారు.
సామాన్య కార్యకర్తలే బలగంగా, దేశహితమే పరమావధిగా ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు ప్రపంచ రాజకీయ యవనికపై అగ్రస్థానానికి చేరుకుందని రాంచందర్ రావు గుర్తు చేశారు. నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయి వేసిన పటిష్ట పునాదులపై నేడు పార్టీ అప్రతిహతంగా దూసుకుపోతోందని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల విజయం కోసమే కాకుండా సామాజిక మార్పు కోసం, అంత్యోదయ సిద్ధాంతంతో పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. సామాన్య కార్యకర్తకు సైతం ఉన్నత పదవులు అందిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తున్న తీరును వివరించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు.
తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త ప్రజల గొంతుకగా మారి పోరాడాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడంలో బీజేపీ కార్యకర్తలు ముందుండాలని, సామాన్యులకు భరోసా కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం నేడు స్వయం సమృద్ధమైన, దృఢమైన దేశంగా మారుతోందని, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టే ప్రయాణంలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించాలని, అందుకు పార్టీ కేడర్ క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరచాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి అమోఘమని ప్రశంసించారు. నాటి జనసంఘ్ కాలం నుంచి నేటి బీజేపీ వరకు సాగిన ఈ ప్రయాణంలో ఎంతో మంది నాయకులు తమ జీవితాలు ధారపోశారని, వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని పేర్కొన్నారు. ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై కమల వికాసం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. నేతలు పరస్పరం మిఠాయిలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.








