* కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు వెళ్తుండగా దంపతుల దుర్మరణం.
* కొణిజర్ల సాగర్ కెనాల్ వద్ద కారు-లారీ భీకరంగా ఢీ.. ముగ్గురు మృతి.. ఒకరి పరిస్థితి విషమం.
* రాజమండ్రికి చెందిన దంపతులతో పాటు విజయవాడ డ్రైవర్ మృతి.. ఖమ్మం-వైరా మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.
ఖమ్మం ,మహా.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొణిజర్ల వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కొణిజర్ల సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద ఒక కారు , లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన దంపతులతో పాటు విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ దుర్మరణం చెందడం స్థానికంగా కలకలం రేపింది. పదో తరగతి పూర్తి చేసుకున్న తమ కుమారుడిని ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో చేర్పించేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం చూసేవారిని కన్నీరు పెట్టించింది.
ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన ఉండమట్ల వీర్రాజు (48) తన భార్య వీరశైలజ (36) మరియు కుమారుడు యశ్వంత్‌తో కలిసి ఏపీ 39సి 6369 నెంబర్ గల కారులో వైరా నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఖమ్మం నుంచి వైరా వైపు ఏపీ 16 టీజీ 8359 నెంబర్ గల లారీ వేగంగా వస్తోంది. కొణిజర్ల సమీపంలోని సాగర్ కెనాల్ మలుపు వద్దకు రాగానే రెండు వాహనాలు అతివేగంతో ఒకదానికొకటి భీకరంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వీర్రాజు దంపతులతో పాటు లారీ డ్రైవర్ షేక్ జానీ బాషా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ముగ్గురూ తుదిశ్వాస విడిచారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన లారీ డ్రైవర్ షేక్ జానీ బాషా విజయవాడలోని గుణదల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న యశ్వంత్ (15) ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. తన కళ్ల ముందే తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండటంతో ఆ బాలుడు షాక్‌కు గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్తున్న ఆ కుటుంబంలో ఈ ఘోర ప్రమాదం పెను చీకటిని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
సమాచారం అందుకున్న వైరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మార్చురీకి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రశాంతంగా సాగాల్సిన ఒక ప్రయాణం.. అజాగ్రత్త వల్ల చివరకు స్మశాన వాటికకు చేరడం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.








