హైదరాబాద్, మహా.
పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫేస్‌బుక్ రిక్వెస్టులు ప్రాణసంకటంగా మారుతున్నాయి. అందమైన ముఖచిత్రంతో పలకరించి, మాటలతో ముగ్గులోకి దించి, ఆపై పెట్టుబడుల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జేబులకు భారీ కన్నం వేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ తరహా మోసానికి గురై ఏకంగా రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న ఉదంతం కలకలం రేపుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లో నివసించే వీరభద్రరావు అనే టెక్కీకి గతేడాది ఆగస్టులో ఫేస్‌బుక్‌లో ‘కోరా’ అనే పేరుతో ఒక యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను సింగపూర్‌కు చెందిన వ్యక్తినని, ప్రస్తుతం ముంబైలో పని చేస్తున్నానని ఆమె అతడికి నమ్మబలికింది.
కొన్ని నెలల పాటు వీరిద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలోనే తనకు వివిధ దేశాల్లో సంపన్న స్నేహితులు ఉన్నారని చెప్పిన కోరా, అతడిని ఒక ఫేస్‌బుక్ పేజీలో చేర్చింది. అందులోని సభ్యులు ఫేస్‌బుక్ స్టోర్‌లో పెట్టుబడులు పెట్టి కోట్లు గడిస్తున్నారని, ట్రేడింగ్ చేస్తే భారీ లాభాలు వస్తాయని వీరభద్రరావును ప్రలోభపెట్టింది. తొలుత ఈ ప్రతిపాదనను ఆయన తిరస్కరించినప్పటికీ, ఆమె పదేపదే లాభాల స్క్రీన్ షాట్లు చూపిస్తూ అతడిని మానసికంగా ఒప్పించింది. ఆపై ఆమె పంపిన ఒక ఏపీకే (APK) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడంతో, అతడి ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను పోలిన ఒక నకిలీ యాప్ ప్రత్యక్షమైంది.
అక్కడితో ఆగని నిందితురాలు, ఈ ట్రేడింగ్‌లో మెళకువలు నేర్చుకోవడానికి జర్మనీకి చెందిన బెల్లా అనే మరో స్నేహితురాలితో మాట్లాడాలని సూచించి ఆమె ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ బెల్లా చెప్పిన సూచనల ప్రకారం వీరభద్రరావు గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 వరకు విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.2.36 కోట్లు బదిలీ చేశాడు. ఆ నకిలీ యాప్‌లో అతడి పెట్టుబడికి భారీగా లాభాలు వస్తున్నట్లు చూపిస్తుండటంతో, అది నిజమేనని నమ్మి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాడు. తీరా ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకుందామనే సరికి సాంకేతిక కారణాలు చూపుతూ యాప్ నిర్వాహకులు తిరస్కరించారు. ఎంత ప్రయత్నించినా పైసా కూడా చేతికి అందకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ఖాతాలు ఎవరివి, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.








