- 4.5 కిలోల బరువుతో శిశువు జననం.
- సాధారణ ప్రసవంతో వైద్యుల రికార్డు!
భద్రాద్రి కొత్తగూడెం,మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అరుదైన ప్రసవానికి వేదికైంది. అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత అనే గిరిజన మహిళ ఏకంగా 4.5 కిలోల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా నవజాత శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువుతో పుట్టడం సహజమని, అయితే ఈ శిశువు నాలుగున్నర కిలోల భారీ బరువుతో పుట్టడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
సాధారణంగా ఇంతటి బరువున్న శిశువుల జననం సమయంలో తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుందని, అటువంటి సందర్భాల్లో శస్త్రచికిత్స (సిజేరియన్) తప్పనిసరని వైద్యులు భావిస్తుంటారు. అయితే, గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక నేతృత్వంలోని వైద్య బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మమతకు సాధారణ ప్రసవం చేశారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా సుఖప్రసవం జరగడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, శిశువు బరువు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలు, గైనకాలజిస్ట్ మౌనిక పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని స్థానికులు కొనియాడుతున్నారు. నాలుగున్నర కిలోల బరువుతో బాబు జన్మించాడన్న వార్త ప్రస్తుతం అశ్వారావుపేట పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. వైద్యుల అంకితభావాన్ని, సమయస్ఫూర్తిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.








