Mahaa Daily Exclusive

  దేశంలోనే తొలిసారి..! బేగంపేట రన్‌వే కింద ‘ఆరు వరుసల’ అద్భుతం..!

Share

హైదరాబాద్, మహా.

మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన, వినూత్నమైన భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా ఒక విమానాశ్రయం రన్‌వే కింద నుంచి ఆరు వరుసల అండర్‌పాస్ సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద సుమారు 600 మీటర్ల పొడవునా ఈ సొరంగం రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తుది పరిశీలనలో ఉన్నాయి. మరో రెండు వారాల్లోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు లభిస్తాయని హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలోని కీలక ప్రాంతాలైన ప్యారడైజ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు చేపట్టిన 5.5 కిలోమీటర్ల భారీ కారిడార్ నిర్మాణంలో ఈ అండర్‌పాస్ అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా తాడ్‌బండ్ వద్ద ఉన్న మలుపు కారణంగా రహదారి విస్తరణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ భౌగోళిక అడ్డంకిని అధిగమించేందుకు భూగర్భ మార్గమే సరైన ప్రత్యామ్నాయమని భావించిన ప్రభుత్వం, రన్‌వే కింద నుంచి సొరంగం నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు డిజైన్లను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ), ఏఏఐ బృందాలు సంయుక్తంగా క్షుణ్ణంగా సమీక్షిస్తున్నాయి. విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ నిర్మాణం జరగనుంది.

నగర ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయం కింద భూగర్భ మార్గాన్ని నిర్మిస్తున్న తొలి నగరం హైదరాబాద్‌గా నిలవనుందని గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించగా, ఏఏఐ ఛైర్మన్ సానుకూలంగా స్పందించి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయం కింద కూడా అండర్‌పాస్ ప్రతిపాదన ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాజకీయ కారణాల రీత్యా కేంద్రం నుంచి అనుమతుల ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ, ఎట్టకేలకు ప్రాజెక్టు పట్టాలెక్కనుండటంతో నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Latest