Mahaa Daily Exclusive

  రాజకీయ యవనికపై కవిత కొత్త అంకం..!  ‘బంజారా’ అస్త్రంతో వ్యూహాత్మక అడుగులు..!

Share

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శ్రీకారం చుట్టారు. ఈ నెల 25న నూతన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న తరుణంలో, ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సామాజిక సమీకరణాలను తనవైపు తిప్పుకునే దిశగా ఆమె వేస్తున్న అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో బంజారా సామాజిక వర్గ ప్రముఖులతో ఆమె జరిపిన మంతనాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసానికి స్వయంగా వెళ్లిన కవిత, అక్కడ పలువురు బంజారా సామాజిక వర్గ మేధావులు, రిటైర్డ్ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికలను వారితో పంచుకుంటూ, కొత్త ప్రయాణంలో అండగా నిలవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సంధించిన విమర్శలు పదునుగా ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బంజారా సామాజిక వర్గానికి కనీస ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆ వర్గ ఆత్మగౌరవానికి జరుగుతున్న అవమానమని, జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.

రాబోయే కాలంలో తమ పార్టీలో బంజారాలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా, వారి అభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో ఆ వర్గ మేధావుల సలహాలను తీసుకుంటామని కవిత హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో మార్పు కోరుకునే బంజారా యువతను, చైతన్యవంతమైన నాయకులను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆమె పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభకు ముందే అన్ని వర్గాల ఆశీస్సులు పొందేలా ఆమె చేపట్టిన ఈ ‘సామాజిక మంతనాలు’ ఇతర రాజకీయ పార్టీల్లో కలవరం పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల ఓటు బ్యాంకుకు కవిత ఏ మేరకు గండికొడతారో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

Latest